అబ్బ దబ్బ జబ్బ.. భలే భలే ఆఫర్!

0

గత కొన్నేళ్లుగా సూపర్ హీరోల కాన్సెప్టుతో తెరకెక్కే సినిమాలు హాలీవుడ్ స్టూడియోలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సూపర్ మాన్… స్పైడర్ మాన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఇప్పుడు మరుగున పడిపోయిన పాతకాలపు టెలిఫోన్ డైరెక్టరీ సైజు బుక్కు అవుతుంది. ఇక ఈ కోవలోనే సూపర్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు డీసీ కామిక్స్ వారి ‘వండర్ వుమన్’ అలాంటిదే. ప్రస్తుతం డిస్నీ వారు ఇలాంటిదే ఓ కొత్త సూపర్ వుమన్ పాత్రను డిజైన్ చేశారట. ఈ పాత్రలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తురన్నాట.

డిస్నీ.. సూపర్ వుమన్ క్యారెక్టర్ అనగానే అదేదో అమెరికా నటీమణుల కోసం అయి ఉంటుందని ఫిక్స్ అయిపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ సూపర్ వుమన్ పాత్ర నేపథ్యం భారతదేశంలో ఉంటుందట. ఈ పాత్రను పోషించబోయే నటికోసం డిస్నీ వారు ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్ మొదలు పెట్టారట. ఇండియా నుంచి ఈ పాత్ర ఆడిషన్స్ కోసం తాప్సీ పన్నుకు ఈ ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశం లభించిందట.

ఒకవేళ తాప్సీ కనుక ఈ ఆడిషన్స్ లో డిస్నీ వారిని మెప్పించగలిగితే మాత్రం ఇక ఆమె రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నట్టే. కారణం ఏంటంటే డిస్నీ వారి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారీ స్థాయిలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతా బాగానే ఉంది. మన వైపునుంచి తాప్సీకి ఏం చెయ్యగలం? ఇప్పుడు ఆమెకు అర్జెంట్ గా కావాల్సింది ఓ నక్కతోక. దయచేసి ఓ మంచి నక్కను పట్టుకుని తోకను ఒడుపుగా కత్తిరించి ఏదో ఒక కొరియర్ లో పంపి.. ఆమె దానిని తొక్కేలా డోర్ దగ్గర పెట్టమని చట్టబద్ధం కాని హెచ్చరికలాంటి సూచన చేస్తే చాలు!
Please Read Disclaimer