ఆడదానిననే నన్నలా చూస్తారా?

0

టాలీవుడ్ లో తాప్సీ తప్పటడుగులు తెలిసిందే. టాలీవుడ్ లో ఏ లిస్ట్ స్టార్లు.. మెగా హీరోలు ఎవరూ లిఫ్ట్ ఇవ్వకపోవడం.. పెద్ద మైనస్ అయ్యింది. టాలీవుడ్ లో లాభం లేదనుకుని తమిళంలో అడుగు పెట్టినా అక్కడా సేమ్ సీన్ ఎదురైంది. పేరొస్తే హిట్టు రాలేదు.. హిట్టొస్తే పేరు రాలేదు! అన్న చందంగా గజిబిజి అయిపోయింది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఊహాతీతమైన అవకాశాలతో దూసుకుపోతోంది. అక్కడ వరుసగా వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో రాణిస్తోంది. బేబీ- పింక్- బద్లా వంటి ప్రయోగాత్మక చిత్రాలతో చక్కని నటి అన్న ప్రశంసలు అందుకుంది.

ముంబై పరిశ్రమలో పట్టు దొరకగానే.. ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావుపై ఘాటైన కామెంట్లతో విరుచుకుపడి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా అదే తీరుగా బిగ్బీ అమితాబ్ ని ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

`బద్లా` చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి తాప్సీ నటించింది. అయితే ఇందులో తన పాత్ర నిడివి ఎక్కువేనని.. అయితే అందరూ అది మర్చిపోయి ఈ చిత్రాన్ని కేవలం అమితాబ్ చిత్రంగానే చూస్తున్నారని మండిపడింది. తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీ మరోసారి `బద్లా` చిత్రం విషయంలో తన ప్రాముఖ్యతను తగ్గించి చూపిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. `బద్లా` రిలీజ్ తరువాత ఓ వెబ్ పోర్టల్ `అమితాబ్ బద్లా`చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయని రాసారని.. అది గమనించిన తాను సదరు వెబ్ సైట్ వారికి “మీరు నా పేరును ప్రస్తావించడం మర్చిపోయినట్టున్నారని గుర్తు చేశాన“ని చెప్పుకొచ్చింది.

బిగ్బి అమితాబ్ క్రెడిట్ ని తక్కువ చేయాలని తాను ఇలా చెప్పడం లేదని.. మహిళను కాబట్టే తన పేరుని ఎవరూ ప్రస్తావించడం లేదని.. ఈ చిత్రంలోని అత్యధిక సన్నివేశాల్లో తానే కనిపిస్తానని.. అలాంటప్పుడు ఈ చిత్రాన్ని కేవలం ఓ నటుడి చిత్రంగానే చాలా మంది ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. అమితాబ్ ఓ లెజెండ్ అని తనకూ తెలుసునని.. ఆయనంటే నాకు గౌరవం వుందని తాప్సీ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer