టాక్ ఆఫ్ ది టౌన్: ఇండియా వెర్షన్ సూపర్ హీరోలు ఢీ అంటే ఢీ

0

భారతదేశంలో సూపర్ హీరోల వెల్లువ ఇన్నాళ్లు వెలుపలి నుంచే. అది కూడా హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలతోనే మన ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే క్రిష్ సిరీస్ .. ధూమ్ సిరీస్ తో కొంతవరకూ ఆ లోటు తీరింది. క్రిష్ సిరీస్ చిత్రాలు ఇండియన్ వెర్షన్ సూపర్ మేన్ ని ఆవిష్కరించాయి. వరల్డ్ క్లాస్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ పేరు ఓ రేంజులోనే మార్మోగింది. ఆ తర్వాత ధూమ్ సిరీస్ లో విలన్ క్యారెక్టర్ కి సూపర్ హీరో క్వాలిటీని ఆపాదించి అదరగొట్టారు.

ఇటీవల హృతిక్- క్రిష్ 4 కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా పెండింగ్ ప్రాజెక్ట్ ఇది. 2021లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక హృతిక్ లాంటి యాక్షన్ స్టార్ నుంచి అలాంటి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు.

హృతిక్ తర్వాత మళ్లీ సూపర్ హీరో ఎవరు? అంటే కంగన పేరు ప్రస్థావించాలి. క్రిష్ 3లో సూపర్ గాళ్ తరహా పాత్రలో కంగన అదరగొట్టింది. కంగన కథానాయికగా భారీ యాక్షన్ చిత్రం 2021లో పూర్తి కానుంది. ఇందులో మెషీన్ గన్స్ తో భీభత్సంగా పోరాడే యువతిగా కంగన కనిపించనుంది. ఇక 2.0 చిత్రంలో రజనీ.. రోబోటిక్ విన్యాసాలు.. ఎమీజాక్సన్ రోబోగాళ్ గా చేసిన విన్యాసాలు మరువలేం.

ఇక మళ్లీ సూపర్ హీరో కేటగిరీనే కావాలనుకుంటే.. ప్రస్తుతం దేశంలో తొలి మహిళా సూపర్ హీరోగా కత్రిన తనని తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కత్రిన కైఫ్ ని సూపర్ హీరో తరహా పాత్రలో చూపించేందుకు `మిస్టర్ ఇండియా` తరహా కాన్సెప్టును ఎన్నుకున్నట్టు ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది అనీల్ కపూర్ మిస్టర్ ఇండియా స్ఫూర్తితో డిజైన్ చేసినదే అయినా దానికంటే భిన్నంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ మూవీ కూడా నాలుగు సినిమాల ఫ్రాంఛైజీలో ఒక భాగం అని వెల్లడించారు. ఒక బ్యాడ్ ఈవిల్ ని ఎదురించే కామన్ ఉమెన్ (కత్రిన) సూపర్ హీరోగా మారితే ఎలా ఉంటుందో చూపిస్తారట. `టైగర్ జిందా హై` డైరెక్టర్.. ఇది సిరీస్ తరహా మూవీ అని ఇందులో సల్మాన్ కూడా రెండో భాగంలో చేరతాడని అన్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ యువ హీరో యూరి ఫేం విక్కీ కౌశల్ ఇదే తరహాలో సూపర్ హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అశ్వథ్థామ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆదిత్యాధర్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే.. డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్ 3డి` ప్రారంభమైంది. ధూమ్ 4 లో విలన్ పాత్రకు యష్ రాజ్ సంస్థ ప్రభాస్ ని సంప్రదించిన సంగతి తెలిసిందే. ఈ రెండిటిలో ప్రభాస్ పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉండనుంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోయే చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్నది. ఇందులో ప్రభాస్ పాత్ర ఫిక్షనల్ గా మెరిపించనుంది. హృతిక్ రోషన్ తర్వాత మళ్లీ ఆ రేంజులో మెప్పించే సత్తా ఉన్న ఏకైక సూపర్ హీరోగా ప్రభాస్ గురించి సౌత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.