భారమంతా తమన్నా.. కాజల్ పైనే పెట్టారే!

0

ఒక సినిమాను మార్కెట్ చేయాలంటే దేన్ని చూపించి అమ్ముతారు? మన టాలీవుడ్ వరకూ తీసుకుంటే హీరోను చూపించే సినిమాను అమ్మాల్సి వస్తుంది.. హీరోను చూపించే ప్రమోషన్ చేయాల్సి వస్తుంది. అలా కుదరకపోతే డైరెక్టర్.. లేదా హీరోయిన్ ను బట్టే బిజినెస్ జరుగుతుంది. అది చాలా కామన్. త్వరలో రిలీజ్ కానున్న రెండు సినిమాలకు హీరోయిన్లే చాలా ముఖ్యం అయ్యారు. వారి గ్లామర్ మీదే ఫిలిం మేకర్స్ నమ్మకం పెట్టుకున్నట్టుగా అనిపిస్తోంది.

ఆ రెండు సినిమాల్లో ఒకటి ‘సీత’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్. పేరుకు హీరో శ్రీనివాస్ అయినప్పటికీ ప్రమోషన్స్ అన్నీ దాదాపుగా కాజల్ చుట్టూ తిరుగుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు ఓపెనింగ్స్ అయితే వస్తాయి కానీ ఇంతవరకూ నిఖార్సైన హిట్ అంటూ లేకపోవడం మైనస్ అయింది. తేజకు డైరెక్టర్ గా ఇమేజ్ ఉంది కానీ అయన ఫోటో చూపించి ప్రమోషన్స్ చేయలేరు కాబట్టి ‘సీత’ ప్రమోషన్స్ కాజల్ చుట్టూ తిరుగుతున్నాయి. కాజల్ గ్లామర్ చిందిస్తున్న పోస్టర్లతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

‘సీత’ మే 24 న రిలీజ్ అవుతుండగా.. మే 31 న ‘అభినేత్రి 2’ రిలీజ్ అవుతోంది. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో ప్రభుదేవా హీరోయిన్ తమన్నా. ఎఎల్ విజయ్ పేరు తెలుగులో చాలామందికి తెలియదు. ఇక హీరోగా ప్రభుదేవాకు పెద్దగా క్రేజ్ లేదు. దీంతో మిల్కీ బ్యూటీ గ్లామర్ ను నమ్ముకునే ప్రమోషన్స్ సాగుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘రెడీ రెడీ’ పాటే దీనికి ఉదాహరణ. అయినా ఎల్ కే జీ స్టాండర్డ్ లో ఉండే ఈ గ్లామర్ ను చూసి ఈ సోషల్ మీడియా జెనరేషన్ ఆడియన్స్ టికెట్లు కొంటారా అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏమో.. గుర్రం ఎగరావచ్చు!