‘జిగర్తాండ’ హిందీ రీమేక్ లో మిల్కీ బ్యూటీ…?

0

గ్యాంగ్ స్టర్ల కథాంశంగా సిద్దార్ధ – బాబీ సింహా ప్రధాన పాత్రలతో తెరకెక్కిన తమిళ సినిమా ‘జిగర్తాండ’. ‘పిజ్జా’ ‘పేట’ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కథిరెసన్ నిర్మించారు. 2014లో రిలీజైన ‘జిగర్తాండ’ మూవీ 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 35 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాని మన తెలుగులో హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో ‘గడ్డలకొండ గణేష్’ (వాల్మీకి) అనే పేరుతో రీమేక్ చేసారు. 14 రీల్స్ రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాలో మృణాళిని రవి పుజాహెగ్డే అధర్వ మురళి ముఖ్యపాత్రలో నటించారు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడమంటే అంత సులభమైన పనికాదు. కథలో అసలు విషయం దారి తప్పకుండా మన ప్రేక్షకులకు నచ్చేలా తీయాలి. అవసరమైతే మన ప్రాంతీయతకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలి. అయితే హరీష్ శంకర్ ఇవన్నీ చేయగలిగాడు. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారట.

వాస్తవానికి ‘జిగర్తాండ’ సినిమాని హిందీలో చేయాలని పలువురు బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు ఆసక్తి చూపించడంతో 2014లోనే బాలీవుడ్ లో రీమేక్ చేస్తామని ఆ చిత్ర నిర్మాత కథిరెసన్ ప్రకటించారు. అయితే ఈ సినిమా వచ్చి ఆరేళ్ళు గడుస్తున్నా హిందీ రీమేక్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. బాబీ సింహా పోషించిన పాత్రని స్టార్ హీరో అజయ్ దేవగన్ చేయబోతున్నాడట. ఇప్పటికే తమిళ ‘ఖైదీ’ రీమేక్ లో నటిస్తున్న అజయ్ దేవగణ్ ‘జిగర్తాండ’ రీమేక్ కి కూడా ఓకే చెప్పేశాడట. అంతేకాకుండా బొమ్మరిల్లు సిద్దార్థ్ ప్లే చేసిన రోల్ కి టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ ని అనుకుంటున్నారట. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందట. టాలీవుడ్ కోలీవుడ్ లలో సక్సెస్ అయిన తమన్నా చాలా ఏళ్ళ నుండి బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ట్రై చేస్తూనే ఉంది. కానీ ఆమెకి అక్కడ నిరాశే ఎదురవుతూ వస్తోంది. కానీ తెలుగు తమిళంలో మాత్రం ఎదో ఒక సినిమాతో బిజీ అవుతూనే ఉంది. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధికీతో ‘బోలే చుడియా’ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ‘జిగర్తాండ’ హిందీ రీమేక్ లో నటించేది నిజమైతే ఈ సినిమాతో అయినా మిల్కీ బ్యూటీ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి.
Please Read Disclaimer