ఫ్లాప్ మూవీ కథతో మిల్కీ బ్యూటీ ఏం చేయబోతుంది?

0

హీరోయిన్ గా దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ గా కొనసాగిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో కాస్త వెనుకబడి పోయింది. ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ ఉన్నా అవి సక్సెస్ కాకపోవడంతో ఆఫర్లు మెల్ల మెల్లగా తగ్గుతున్నాయి. దాంతో ఈమె ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా కోసం ఒక టాక్ షోను కమిట్ అయ్యింది. పలువురు హీరోలను హీరోయిన్స్ ను డైరెక్టర్స్ ను ఆమె ఇంటర్వ్యూ చేయనుంది.

ఈ సమయంలోనే ఈమె యూవీ క్రియేషన్స్ లో ఒక వెబ్ సిరీస్ ను కూడా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త దర్శకుడు ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం హాలీవుడ్ ఫ్లాప్ మూవీ హష్ స్టోరీ లైన్ ను తీసుకుని వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారట. స్టోరీ లైన్ ఎంటర్ టైన్ మెంట్ గా ఉండటంతో పాటు ఆలోచనాత్మకంగా ఉంటుంది. అందుకే ఈ స్టోరీ లైన్ ను ఎంపిక చేసుకుని ఉంటారు అంటున్నారు.

ఈ వెబ్ సిరీస్ కోసం యూవీ క్రియేషన్స్ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ప్రముఖ నటీనటులు ఈ వెబ్ సిరీస్ లో నటించడంతో పాటు సినిమా స్థాయిలో టెక్నాలజీని కూడా వాడనున్నారట. మిల్కీ బ్యూటీ ఈ వెబ్ సిరీస్ తో మళ్లీ సినిమాల్లో బిజీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సినీ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.