బిగ్ బాస్ లోకి తమన్నా

0

బిగ్ బాస్ అంటేనే అనూహ్యం.. అక్కడ ఏదైనా జరగొచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులు ప్లాన్ చేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడమే బిగ్ బాస్ పని. తెలుగు బుల్లితెరపై నంబర్ 1 రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్ బాస్ లో ఈ ఆదివారం అద్భుతం జరగబోతోంది.

బిగ్ బాస్ సీజన్-1లో మొదటి వారంలోనే నటి జ్యోతి ఎలిమినేట్ అయ్యాక ఆమె స్థానంలో రెండో వారంలోనే హీరోయిన్ దీక్షాసేత్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపారు. ఇక బిగ్ బాస్ రెండో సీజన్ లో మరో హీరోయిన్ పూజా రాంచంద్రన్ ను ఇలాగే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపారు. కానీ ఈసారి బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

వైల్డ్ కార్డ్ ద్వారా ఈ ఆదివారం ఒక ట్రాన్స్ జెండర్ (లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి)ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. బిగ్ బాస్ 2లో పాల్గొన్న నూతన్ నాయుడు ఈ మేరకు ఆదివారం వైల్డ్ కార్డ్ ద్వారా తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్ జెండర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈయన ఇదివరకే బిగ్ బాస్ హౌస్ సీజన్ 3లో పాల్గొనే సెలెబ్రెటీల లిస్ట్ ను బయటపెట్టగా అది అక్షరాల నిజమైంది. ఇప్పుడు ట్రాన్స్ జెండర్ ఎంట్రీ ఇవ్వబోతోందని.. తనకు విశ్వసనీయ సమాచారం ఉందని తెలుపడంతో అందరి చూపు ఈ ట్రాన్స్ జెండర్ పై నెలకొంది.

హౌస్ లోకి పురుషుడు ప్రవేశిస్తే మగవారితో.. స్త్రీలు పంపిస్తే ఆడవారితో జట్టు కట్టడం సహజం. ఆడ మగ కూడా ఫ్రెండ్స్ షిప్ కొనసాగిస్తారు. మరి ట్రాన్స్ జెండర్ ను లోపలికి పంపుతున్న బిగ్ బాస్ ఒక రకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ప్రేక్షకులకు షాక్ ఇచ్చినట్టే. ఇప్పటికే హౌస్ లో మొదటివారమే హౌస్ మేట్స్ ఎవ్వరూ ఓపిక లేకుండా చిన్న చిన్న విషయాలకే గొడవలు – కొట్టుకోవడాల వరకు పరిస్థితి వెళ్లింది. ఇప్పుడు ట్రాన్స్ జెండర్ ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

*తమన్నా సింహాద్రి ఎవరు?

తమన్నా సింహాద్రి.. హైదరాబాద్ లో ఉండే ట్రాన్స్ జెండర్. ఈమె వారి హక్కుల కోసం పోరాడే వ్యక్తి. అప్పట్లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్ లో ఆమెకు అండగా నిలిచి తమన్నా వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో ఏకంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై పోటీచేసి సంచలనం సృష్టించారు. ఓడిపోయినా లోకేష్ ను విమర్శిస్తూ మీడియాలో హైలెట్ అయ్యారు. లోకేష్ ను ఓడిస్తానని శపథం చేసిన ట్రాన్స్ జెండర్ తమన్నా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫైర్ బ్రాండ్ ట్రాన్స్ జెండర్ తమన్నా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నూతన్ నాయుడు ప్రకటించినప్పటి నుంచి ఇప్పుడు తమన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈమె బిగ్ బాస్ లోకి ప్రవేశిస్తే ఎవరితో ఉంటారు.? సపరేట్ బెడ్ ఈమెకు ఇస్తారా? అసలు ఈమెను బిగ్ బాస్ హౌస్ మేట్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఇంట్లో ఏం జరుగుతుందనేది ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఆసక్తిగా మారింది.
Please Read Disclaimer