విషాదంలో కోలీవుడ్: లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న యువనటి

0

అందం.. అభినయంతో పాటు సినిమాల్లో స్టార్ డమ్ ను సొంతం కావటానికి కాసింత లక్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉండి.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆఫర్లు వచ్చినప్పటికి.. కొందరు అనూహ్యంగా ఆత్మహత్యలు చేసుకునే వైనం చిత్ర పరిశ్రమలో కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి ఉదంతం కోలీవుడ్ లో చోటు చేసుకుంది. తమిళ యువనటి దీప అలియాస్ పౌలిస్ (29) ఆత్మహత్య చేసుకున్నారు.

అందంతో పాటు.. హుషారైన అమ్మాయిగా గుర్తింపు పొందిన పలు సినిమాల్లో నటించిన ఆమె.. చెన్నైలోని విరుగంబాక్కంలోని ఒక ప్రైవేటు ప్లాట్ లో ఉంటున్నారు. శనివారం ఆమె తల్లిదండ్రులు పలుమార్లు ఫోన్లు చేసినా.. ఫోన్ ఎత్తేలేదు. దీంతో.. వారు ఆమె ఉంటున్న ప్లాట్ కు వెళ్లగా.. ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఒక్కసారి షాక్ కు గురయ్యారు.

కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఆమె.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ రాసినట్లుగా చెబుతున్నారు. సదరు లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని పేర్కొన్న ఆమె.. తన జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అయితే.. అతనెవరు? అన్న విషయాన్ని మాత్రం లేఖలో పేర్కొనలేదని పోలీసులు చెబుతున్నారు. ఆమె మరణం వెనుక.. ప్రేమ వ్యవహారం కారణమై ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

తమిళ చిత్రాల్లో సహాయనటిగా.. చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ తనకంటూ ఒక ఇమేజ్ ను ఆమె సొంతం చేసుకున్నట్లు చెబుతారు. నాజర్ నటించిన వైదా మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఆమె.. పలు సినిమాల్లో నటిస్తున్నారు. యువ నటిగా గుర్తింపు పొందిన ఆమె అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.