కలెక్షన్స్.. పారితోషికాలపై పెద్దాయన ఫైరింగ్

0

హీరోలు.. దర్శకుల పారితోషికాల విషయమై దర్శకరత్న దాసరి నారాయణరావు ఉన్నన్నాళ్లు ఓ రేంజులో ఫైర్ అయ్యేవారు. దొంగ లెక్కలు.. కాకి లెక్కలు చెబుతూ పరిశ్రమలో సొమ్ములన్నీ హీరోలు టెక్నీషియన్లకే దోచి పెడితే కార్మికులు ఏం తిని బతకాలి? అని ప్రశ్నించేవారు. ఆయన వెళ్లిన తర్వాత ఈ మాటను అడిగేవాళ్లే కరువయ్యారు. అప్పుడప్పుడు ఆయన శిష్యుడే అయిన తమ్మారెడ్డి భరద్వాజా దీనిని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన సొంత యూట్యూబ్ చానెల్లో సినిమాల కలెక్షన్ల విషయమై చెప్పే దొంగ లెక్కలు కాకి లెక్కల గురించి .. హీరోలు దర్శకుల పారితోషికాల లెక్కల గురించి మాట తీశారు. కొన్ని కాకి లెక్కలపై ఆయన తీవ్రంగానే మండి పడ్డారు.

ఆయన లెక్క ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో 10 కోట్ల ప్రజలు.. విదేశాలు అక్కడ ఇక్కడా కలిసి ఇంకో ఐదు కోట్లు మొత్తం 15 కోట్ల మంది తెలుగు ప్రజలున్నారన్నది ఓ అంచనా. దీంట్లో సగం మంది సినిమాలు చూడరని అనుకుంటే.. కనీసం 8 కోట్ల మంది చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. యావరేజ్ గా 5 కోట్ల మంది సినిమాలు చూసే జాబితాలో ఉన్నారు అనుకుంటే.. టికెట్ ధర 100 అనుకున్నా.. ప్రతి సినిమాకు 500కోట్లు రావాలంటూ విశ్లేషించారు. అంతేకాదు.. రూపాయి ఇచ్చే హీరోకు వంద రూపాయల అడ్వాన్స్ ను.. ఐదు రూపాయల డైరెక్టర్ కు 20 రూపాయలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి కాకిలెక్కలతో రావడం వల్లనే కొందరు ఫిలింమేకర్స్ పరిశ్రమను నాశనం చేస్తున్నారని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సినిమా అన్నా కళ అన్నా ఫ్యాషన్ తో రావాలని డబ్బు సంపాదనకు కాదని క్లాస్ తీస్కున్నారు.

పెద్దాయన వెళ్లాక ఇలా తిట్టేవాళ్లు లేకపోవడం ఒక లోటు అనుకుంటుంటే తమ్మారెడ్డి ఆ లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. కమర్షియల్ గా డబ్బు సంపాదించడానికి కాకుండా కేవలం కళాత్మక దృష్టితో వచ్చిన నిర్మాతలు ఇప్పుడు ఎందరున్నారు? అలాగే ఇప్పుడున్న స్టార్లలో ఎంత మంది కమర్షియల్ కాకుండా ఉన్నారు? బుల్లితెర సీరియళ్లు.. రియాలిటీ షోలు నిర్మించే నిర్మాతల్లోనూ అలాంటివాళ్లు ఎందరున్నారు? ఇలా లెక్కలు తీసి తమ్మారెడ్డి చెబుతారేమో చూడాలి.
Please Read Disclaimer