ట్రైలర్ టాక్: తానాజి

0

అజయ్ దేవగణ్.. సైఫ్ అలీ ఖాన్.. కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘తానాజి: ది అన్సంగ్ వారియర్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలయింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ మరాఠా యోధుడు తానాజి మాలుసరె పాత్రలో నటించారు. సైఫ్ అలీ ఖాన్ మొఘల్ రాజుల తరఫున మరాఠా సైన్యంతో పోరాడిన ఉదయ్ భాన్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఒక కీలక పాత్రలో నటించడం ఒక విశేషం.

ట్రైలర్ ఆరంభంలో తానాజి చిన్నబాబుగా ఉన్నప్పుడు తానాజి తండ్రి “ఈ భూమికి స్వాతంత్ర్యం తీసుకురావాల్సిన బాధ్యతను నీకు నేను ఆస్తిగా ఇచ్చి వెళ్తున్నాను” అంటూ చనిపోతారు. మరో సీన్ లో అటువైపు మొఘల్ రాజుల ఆధీనంలో ఉన్న కొఠాణా ను విడిపించాలని మహారాణి కోరడం.. అజయ్ దేవగణ్ అందుకు సిద్ధపడడం చూపిస్తారు. ఇందుకు ఉదయ్ భాన్ ను ఓడించాలి. యుద్ధ సన్నివేశాలు.. అజయ్.. సైఫ్ ల స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ లో హలైట్ గా నిలిచాయి. ఇక అజయ్.. సైఫ్ ల మధ్య సంభాషణలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బందీగా చిక్కిన అజయ్ తో “..అంటే నువ్వు పిచ్చోడివా?” అని ప్రశ్నిస్తే “ప్రతి మరాఠా యోధుడు పిచ్చోడే. స్వరాజ్యం కోసం పోరాడే పిచ్చోడు” అంటూ అజయ్ ఓ భారీ డైలాగ్ వేస్తాడు.

ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది. విజువల్స్ లో భారీతనం కనిపిస్తోంది. నటీనటుల గెటప్స్ కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. సీనియర్ నటులు కాబట్టి నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చూస్తుంటే అజయ్ ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేలాగే కనిపిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 10 తారీఖున విడుదల కానుంది. హిందీనే కాదు తెలుగు.. తమిళ భాషల్లో కూడా విడుదల అవుతుందట. ఇక ఆలస్యం ఎందుకు.. చూసేయండి తానాజీ ట్రైలర్.
Please Read Disclaimer