కుదిరితే హీరో కుదరకపోతే డైరెక్టర్

0

`పెళ్లి చూపులు` చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం డి.సురేష్ బాబు ఆస్థాన దర్శకుడిగా రకరకాల ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కాంపౌండ్ లో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. `ఈ నగరానికి ఏమైంది` ఫ్లాపయ్యాక ఎందుకనో దర్శకత్వానికి చిన్నపాటి బ్రేక్ నిచ్చాడట. అయితే దర్శకత్వంలోనే కాకుండా నటనలోనూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నిస్తుండడం అభిమానుల్లో చర్చకొచ్చింది. ఈ ధర్మ సందేహానికి తరుణ్ భాస్కర్ స్వయంగా జవాబు చెప్పారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇటీవలే మా అమ్మ ఒక నోట్స్ చూపించింది. నేను స్కూల్ పిల్లాడిగా ఉన్నప్పుడు రాసిన వాక్యం అది. పెద్దయ్యాక నటుడవుతానని ఆ నోట్ బుక్ లో రాశాను. దానిని బట్టి లోతుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ నటుడవ్వాలనే అనుకుంటారు. అందరిలానే నేను కూడా అప్పుడు అనుకున్నా. అందుకే ఈ ప్రయత్నం కొత్తది కాదు. పరిశ్రమ నన్ను నటుడిగా అంగీకరించకపోయినా సంతోషమే. తిరిగి నేను దర్శకుడిగానో లేక ఎడిటర్ గానో పని చేస్తాను. నటుడిగా అంగీకరిస్తే అది నాకు చాలా సంతోషాన్నిస్తుంది“ అని అన్నారు.

దీనిని బట్టి ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకుని తరుణ్ భాస్కర్ ప్రయోగాలు చేస్తున్నాడని భావించవచ్చు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న `మీకు మాత్రమే చెప్తా` రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. టైటిల్ ని ప్రకటించారు. నిర్మాణానంతర పనులు చేస్తూనే.. ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ సినిమా సంగతుల్ని తెలిపారు. బాలీవుడ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ `ఢిల్లీ బెల్లీ` తరహా చిత్రమిదని తెలిపారు. ఒక ఫిలింమేకర్ గా ఎన్నో నేర్చుకుని నటుడిగానూ నేర్చుకుంటున్నా అని తెలిపారు. ప్లాన్- ఏ అమల్లో ఉండగానే ప్లాన్ బితో మూవ్ అవ్వడం తెలివైన పని తరుణ్ అనుకుంటున్నాడా? అన్నది చూడాలి.
Please Read Disclaimer