టీజర్: విక్రమ్

0

ఇదేమి వింత దెయ్యం .. నవ్వి చంపేస్తోంది. గొడ్డళ్లు దాచుకుని శత్రువులపై విసిరి మరీ లేపేస్తోంది! వింత వెకిలి చేష్టలతో శత్రువును బెంబేలెత్తించి మరీ చంపుతోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దెయ్యంలా ఉంది. ఆ దెయ్యం పాత్రలో నటించింది విశ్వనటుడు కమల్ హాసన్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ. ఇంతకీ ఈ దెయ్యం నామధేయమేమి? అంటే.. విక్రమ్.

విశ్వనటుడు కమల్ హాసన్ 66వ పుట్టినరోజు ట్రీట్ అదిరింది. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ రిలీజైంది. కమల్ కెరీర్ 232 వ చిత్రం టైటిల్ విక్రమ్ అని చిత్రబృందం వెల్లడించింది. విక్రమ్ అనే దెయ్యంగా నటించిన కమల్ హాసన్ ఆహార్యం సాలిడ్ పెర్ఫామెన్స్ ప్రధాన బలం కానుంది.

ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన1986 క్లాసిక్ మూవీ టైటిల్ నే తాజా హారర్ యాక్షణ్ థ్రిల్లర్ కి ఎంపిక చేయడం ఆసక్తికరం. ఈ చిత్రంలో కమల్ హాసన్ పేరులేని పాత్రను పోషించాడు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ టీజర్ ను కమల్ హాసన్కు పుట్టినరోజు కానుకగా అభివర్ణించారు. ప్రియమైన గురు … ఇది మీకు మా వినయపూర్వకమైన బహుమతి సార్. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దయచేసి మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ ఉండండి అని అన్నారు లోకేష్.

ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దళపతి విజయ్ హీరోగా మాస్టర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కనగరాజ్ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది కమల్ హాసన్ కి. అందుకే ఈ ఆఫర్. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా శ్రుతి హాసన్ ఇప్పటికే కామన్ డీపీ రిలీజ్ చేసి.. తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.