100 కోట్ల డీల్.. స్టార్ హీరో కోర్టు కేసు లొల్లు!

0

కేవలం ఐదేళ్లకు ఆ పిట్ నెస్ సెంటర్ ని ప్రమోట్ చేసినందుకు అతడు అందుకుంటున్న మొత్తం ఎంతో తెలిస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. ప్రస్తుతం అదే ఫిట్ నెస్ సెంటర్ వల్ల సదరు హీరో కోర్టులు గొడవలు అంటూ తిరగాల్సిన సన్నివేశం నెలకొంది. ఈ వివాదానికి కూకట్ పల్లి కేంద్రబిందువు అవ్వడం హైదరాబాద్ వాసుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? అంటే ఫ్యాన్స్ గ్రీక్ గాడ్ గా భావించే హృతిక్ రోషన్ గురించే ఇదంతా.

హృతిక్ రెండేళ్లుగా `క్యూర్ ఫిట్` అనే ఫిట్నెస్ సెంటర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై ప్రమోషన్ చేస్తున్నాడు. ఐదేళ్ల ప్రచారం కోసం ఏకంగా 100 కోట్లు అందుకుంటున్నాడు. ఇండియాలో ఇదో పెద్ద స్టార్టప్ కంపెనీ. అందుకే అంత పెద్ద మొత్తం చెల్లించి ప్రచారంతో ఊదరగొట్టేస్తోంది. అయితే ఈ కంపెనీ నిర్వాకంపై హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు “బరువు తగ్గుతారంటూ తప్పుడు ప్రకటనలతో మోసం చేశారు“ అంటూ కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ డైరెక్టర్లతో పాటు హృతిక్ రోషన్ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంస్థ డైరెక్టర్లు ముకేశ్ బన్సాల్- అంకిత్ నగోరి- నిర్వహణాధికారి మణి సుబ్బయ్యతో పాటు హృతిక్ రోషన్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం దీనిపై కోర్టులో న్యాయవిచారణ సాగుతోంది.

ఆ క్రమంలోనే హృతిక్ రోషన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కూకట్ పల్లిలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోర్టును కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సంపూర్ణ వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు- ఫిర్యాదుదారుడు శ్రీకాంత్ కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ నాలుగు వారాల్లో జరగనుంది. అప్పటివరకూ హృతిక్ పై కానీ.. క్యూర్ ఫిట్ సెంటర్ పై కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూకట్ పల్లి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 100 కోట్ల డీల్ .. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న హృతిక్ ని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Please Read Disclaimer