పునర్నవి రాకతో రాహుల్‌లో ఉత్సాహం.. ఎత్తుకెళ్లిపోయాడు!!

0

ఇంట్లో 103వ రోజు ఉదయం ‘హ్యాపీడేస్’లోని ఓ మై ఫ్రెండ్ పాటతో ఐదుగురు సభ్యులు నిద్ర లేచారు. వాళ్లు ఫ్రెషప్ అవుతున్న సమయంలో హౌస్‌లోకి ఇద్దరు అనుకోని గెస్టులు వచ్చారు. వాళ్లెవరో ఇంట్లో ఉన్న సభ్యులకు తెలీదు. వాళ్లు మాత్రం వరుణ్ అన్న, శ్రీముఖి అక్క, రాహుల్ అన్న అంటూ వరసలు కలుపుకుంటూ పరిచయం చేసుకున్నారు. ఇంతకీ వాళ్లు ‘హలో’ యాప్ లక్కీ విన్నర్స్. ఈ యాప్ నిర్వహించిన కాంపిటీషన్‌లో గెలిచిన సుభాష్, ఫణి కుమార్‌లకు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించారు. ఇలా వాళ్లిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడమే కాకుండా టాప్ 5 కంటెస్టెంట్లతో కాసేపు గడిపారు.

సుభాస్, ఫణి వెళ్లిపోయిన తరవాత ఇప్పటికే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ప్రత్యేక అతిథులుగా ఎంట్రీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ముందుగా రవికృష్ణ వచ్చాడు. అతని రాకతో హౌస్‌లో ఒక్కసారిగా సందడి మొదలైంది. డోర్ తెరుచుకుని రవి గార్డెన్ ఏరియాలో అడుగుపెట్టగానే అలీ ఆలింగనం చేసుకున్నాడు. ఆ తరవాత రాహుల్, వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్ అతనికి ఆత్మీయ స్వాగతం పలికారు. బ్రేక్ ఫాస్ట్ సమయంలో రావడంతో రవికి దోసెలు వేసి పెట్టారు.

ఉదయం 10 గంటల తరవాత బాబా భాస్కర్ కాపీ కప్పుతో స్మోకింగ్ రూంకి వెళ్తున్నప్పుడు మెయిన్ డోర్ తెరుచుకుంది. అక్కడి నుంచి జాఫర్ ఎంట్రీ ఇచ్చారు. అంతే, బాబా భాస్కర్‌లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. జాఫర్ కూడా ఎంతో సంతోషంతో బాబా భాస్కర్‌ను రెండు చేతులతో ఒడిసి పట్టుకుని పైకెత్తేశారు. అందరితో సరదాగా పలకరింపులు అయిపోయిన తరవాత అంతా కలిసి లివింగ్ ఏరియాలో కూర్చొని ముచ్చట్లు పెట్టారు. ఈ సమయంలో జాఫర్‌పై బాబా భాస్కర్ పంచ్‌లు వేయడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ నవ్వులు పువ్వులు పూశాయి.

అప్పటి వరకు ఒక్కరు ఒక్కరిగా ఎంట్రీ ఇస్తే.. ఈసారి ఇద్దరు మాజీ కంటెస్టెంట్లు ఒకేసారి ఇంట్లోకి వచ్చారు. వారిద్దరు అషు రెడ్డి, రోహిణి. వీళ్లిద్దరూ హౌస్‌లోకి అడుగుపెట్టగానే మొదటిగా శ్రీముఖి గట్టిగా కేక పెట్టింది. ఆ తరవాత వీరిద్దరూ అందరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇలా ఒక్కొక్కరూ హౌస్‌లోకి అడుగుపెడుతుండటంతో ఒక్కసారిగా సందడి మొదలైంది. మళ్లీ షో ప్రారంభమైన నాటి రోజులు గుర్తుకొచ్చాయి. అయితే సడెన్‌గా ఒక మనిషి ఎంట్రీ ఇవ్వడంతో ఇంకో రకమైన సందడి మొదలైంది హౌస్‌లో..! ఆ వ్యక్తి ఎవరో కాదు తమన్నా సింహాద్రి.

ఎప్పటిలానే హాట్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చింది తమన్నా. తైస్ కనిపించేలా పొట్టి ఫ్రాక్‌లో బ్యూటీ క్వీన్‌లా రెడీ అయి వచ్చింది. ఆమెను చూసిన శ్రీముఖి హాటీ అంటూ ఆలింగనం చేసుకుంది. ఇక నవ్వుతూ దగ్గరకి వచ్చిన బాబా భాస్కర్.. ‘‘రంభలా రెడీ అయి వచ్చిందే’’ అంటూ చురక అంటించారు. ఇక తమన్నా ఉత్సాహాన్ని ఆపగలమా..? రవి, అషు, వరుణ్‌లను తప్ప మిగిలిన అందరినీ గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని పంచుకుంది. రాహుల్ అయితే తమన్నా ఐ లవ్ యూ అంటూ స్వాగతం పలికాడు. ఈ పాయింట్‌ను పట్టుకున్న రవి.. ‘‘బయటికి వెళ్లినప్పుడు చెప్పా.. రాహుల్ గాడికి నువ్వంటే ఇష్టం నిన్ను ప్రేమిస్తున్నాడంట అని. నాకు కూడా వాడంటే ఇష్టం అని చెప్పింది తమన్నా’’ అంటూ ఆటపట్టించాడు.

ఆ తరవాత మధ్యాహ్నం భోజనం సమయంలో పునర్నవి, వితికా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీముఖి అరుపులు కేకలు పెట్టుకుంటూ వారికి స్వాగతం పలికింది. పునర్నవవిని అయితే చంటి పిల్లను ఎత్తుకున్నట్టు ఎత్తుకుని రాహుల్ దగ్గరికి తీసుకెళ్లింది. రాహుల్ కూడా ఆమెను రెండు చేతులతో ఒడిసి పట్టుకుని ఎత్తుకున్నాడు. మరోవైపు వితికా భర్తను గట్టిగా కౌగిలించుకుని ఎలా ఉన్నవావంటూ యోగక్షేమాలు అడిగింది. ఆ తరవాత హౌస్‌లో ఉన్నవారంతా వీరిద్దరికీ స్వాగతం పలికారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ప్రేక్షకుల టాక్ ఎలా ఉందో వితికా, పునర్నవి కలిసి వరుణ్, రాహుల్‌లకు వివరించారు.

ఆ తరవాత కొంతసేపటికి శిల్పా చక్రవర్తి, శివజ్యోతి, మహేష్ విట్టా హౌస్‌లోకి వచ్చారు. మహేష్ అరుపులు కేకలు వేస్తూ అందరినీ అలర్ట్ చేశాడు. దీంతో రవి, రోహిణి, అషు పరుగున వెళ్లి వీళ్ల ముగ్గిరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. అయితే, మహేష్ చెప్పినట్టుగా తాను ఫైనల్‌కు వెళ్లానని.. అందుకని టిక్కెట్ టు ఫినాలేను మహేష్‌కి ఇస్తున్నానని చెబుతూ బిగ్ బాస్ లోగోతో ఉన్న గ్లాస్ షీల్డ్‌ను బాబా భాస్కర్‌ ఇచ్చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాహుల్, పునర్నవి గార్డెన్ ఏరియాలో డిస్కషన్ పెట్టారు. ‘‘ఏమనుకుంటున్నారు బయట’’ అంటూ రాహుల్ స్టార్ట్ చేశాడు.

‘‘ఈ రెండు వారాల్లో నీకు కొత్త బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు కదా. నేను ఏం చెప్పినా నీకు ఫేక్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను నీ ట్రూ బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా’’ అని పునర్నవి మొదలుపెట్టింది. అదేం లేదని రాహుల్ అంటుంటే.. ‘‘ఈ మధ్య చాలా ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నావ్’’ అని పునర్నవి అడ్డుపడింది. ‘‘నీతో తిరిగి తిరిగి అలా వచ్చుంటుంది’’ అని వెంటనే సెటైర్ వేసేశాడు రాహుల్. పునర్నవి ఊరుకుంటుందా.. ‘‘సెన్స్ కూడా నాలా వచ్చుంటే బాగుండేది’’ అంటూ రివర్స్ పంచ్ వేసేసింది. మొత్తం మీద మళ్లీ పాత రోజుల్ని గుర్తుచేశారు వీళ్లిద్దరూ.

ఆ తరవాత కొద్ది సేపటికి హేమ, హిమజ ఇంట్లోకి అడుగుపెట్టారు. అనంతరం బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్‌లో సోఫాలో కూర్చోవాల్సిందిగా సందేశం పంపించారు. వాళ్లకు తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి హౌస్‌లో వారి ప్రయాణాన్ని మొదటి నుంచి వేసి చూపించారు. ఆ తరవాత ఇంట్లో ఉన్న అందరికీ బిగ్ బాస్ ఒక్కో పత్రాన్ని అందజేశారు. రాత్రి జరిగే అవార్డుల ఫంక్షన్‌కు సంబంధించి ఆ పత్రాల్లో ప్రతి సభ్యుడు ఎవరికీ తెలియకుండా నింపాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను స్టోర్ రూంలో పెట్టేయాలి. అంతా అలానే చేశారు. ఇక రాత్రికి అవార్డ్స్ ఫంక్షన్ ప్రారంభమైంది. ఆ ఫంక్షన్‌లో ఏంజరిగిందో తెలియాలంటే శనివారం నాటి ఎపిసోడ్ చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home