AA20లో తెలుగమ్మాయి జాక్ పాట్

0

టాలీవుడ్ లో తెలుగమ్మాయిల వెల్లువ నెమ్మదిగా పెరుగుతోంది. అందానికి అందం.. ప్రతిభ ఉన్న భామలు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. సోషల్ మీడియా వెల్లువలో తెలుగమ్మాయిలకు ఫోకస్ పెరిగింది. ఆ కోవలోనే లఘు చిత్రాల బ్యూటీ పూజిత పొన్నాడ నిరంతరం ఇన్ స్టా మాధ్యమంలో హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. తొలుత లఘు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడిని పిలిచి ట్యాలెంటెడ్ సుకుమార్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

రంగస్థలం చిత్రంలో చరణ్ సోదరుడైన ఆది పినిశెట్టి ప్రేమించే అమ్మాయిగా కీలక పాత్రనే పోషించింది. ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ చిత్రంలో నటించిన భామగా పూజితకు ఫోకస్ బాగానే వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజై లక్ చెక్ చేసుకున్నాయి. అయితే స్టార్ హీరో రేంజు ఆఫర్ అయితే మరొకటి తగల్లేదనే చెప్పాలి. చెన్నయ్ లో స్టడీ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి నెమ్మదిగా అవకాశాలు పెరుగుతున్నా.. పెద్ద స్థాయికి చేరే జాక్ పాట్ అయితే తగల్లేదు.

తాజా సమాచారం ప్రకారం.. లెక్కల మాస్టార్ సుకుమార్ నుంచి పిలుపు అందిందట. మరోసారి పూజాకి అదిరిపోయే క్యారెక్టర్ ని ఆఫర్ చేశాడట. అది కూడా అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఏఏ20లో ఈ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. తిరుపతి శేషాచల అడవుల నేపథ్యం ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిత్తూరు యాసకు ప్రాధాన్యత ఉంది. ఇక ఇందులో పూజిత పొన్నాడకు ఎలాంటి పాత్రలో అవకాశం ఇచ్చారు అన్నది తెలియాల్సి ఉంది. తెలుగమ్మాయి పూజిత అందం చందంలో మేటి అనడంలో సందేహం లేదు. ఆ రెండిటితో పాటు ప్రతిభలో రష్మిక మందనను డామినేట్ చేసేస్తుందేమో చూడాలి.




Please Read Disclaimer