వామ్మో టాలీవుడ్ ఎక్స్ పెరిమెంట్స్!

0

టాలీవుడ్లో ఒకప్పుడు ప్రయోగం అంటేనే భయపడేవారు. ఆ మాటే ఎత్తొద్దని హీరోలు- నిర్మాతలు దర్శకరచయితల్ని ఎగతాలిగా చూసేవాళ్లు. సేఫ్ గేమ్ ఉండగ మనకెందుకీ ప్రయోగాలు!! అంటూ పక్కన పెట్టేసేవారు. అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్.. ఐదు పాటలు.. ఆరు ఫైట్ లు ఇవుంటే సినిమా రికార్డులు బ్రేక్ చెసేస్తుంది అనే ధోరణి ఉండేది. “ప్రయోగాల జోలికి వెళితే జనాలు థియేటర్లకు రారు కదా మనం తీసేవి ఆర్ట్ సినిమాలు అనుకునే ప్రమాదం వుంది.. పొరపాటున కూడా ఈ సినిమా ప్రయోగం…ఈ కథ ప్రయోగాత్మక కథ అనే స్టేట్ మెంట్లు ఇచ్చినా జనాలు నవ్విపోతారు“ అంటూ హీరోలు- నిర్మాతలు తమకు ఎంత కొత్త కథ చెప్పినా ఇలాగే దర్శకరచయితలకు లెక్చర్లు దంచేవాళ్లు.

ఒక రకంగా ఈ కమర్షియల్ ధోరణి వల్ల తెలుగు సినిమా అంటే దేశ వ్యాప్తంగా చిన్న చూపు ఉండేది. తెలుగు సినిమా పేరెత్తితే చాలు ఏం ఉంటుందిలే! అని తీసిపారేసేవాళ్లు. తెలుగు సినిమాలో నేల విడిచి సాము చేసే కథలు.. హీరో అంటే ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా ఒక్కడే వందమందిని మట్టి కరిపించేస్తుంటాడు! ఇంతకు మించి చెప్పుకోడానికి ఏమీ కనిపించదనే విమర్శ ఉండేది.. రెండు మూడేళ్ల క్రితం తెలుగు సినిమాపై వినిపించిన విమర్శ ఇది. కానీ కాలం మారింది. ట్రెండూ మారుతోంది. దానికి అనుగుణంగా మారకపోతే షెడ్డుకి వెళ్లిపోవాల్సిందే అనుకున్నారో ఏమో గానీ మన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రయోగం తప్ప కమర్షియల్ కథలవైపు పొరపాటున కూడా తొంగి చూడటానికి సాహసించడం లేదు. దాంతో నవ్యపంథా కథలు తెరపైకి వస్తున్నాయి. ఇది శుభపరిణామం అని విశ్లేషిస్తున్నారు.

కొంత విరామం తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి రెగ్యులర్ కథలని పక్కన పెట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న `సైరా నరసింహారెడ్డి` చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. చిరు తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసినా సైరా పూర్తిగా వేరు. వారియర్ గా పూర్తి ప్రయోగాత్మక పాత్రలో ఎంతో రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. ఇక `బాహుబలి` విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇందులో ఒక గజదొంగగా `ధూమ్ తరహా పాత్రలో కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నాడు. `మహర్షి` తరువాత మహేష్ `సరిలేరు నీకెవ్వరు` పేరుతో రూపొందుతున్న సినిమాలో ఆర్మీమేజర్ గా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకూ మహేష్ ఈ తరహా పాత్రలో నటించలేదు. చిరు- ప్రభాస్- మహేష్ ఈ ముగ్గురికి ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో పాత్రలు పూర్తి వైవిధ్యమైనవనే చెప్పాలి.

ఇక కమెడియన్ గా గుర్తింపు పొందిన ప్రియదర్శి చెట్టుకింద మల్లేశం జీవితకధ ఆధారంగా తెరకెక్కెతున్న ఫక్తు నైజాం నెటివిటీ సినిమా `మల్లెశం`లో నటించాడు. ఆది పినిశెట్టి బుధవారం మొదలుపెట్టిన `క్లాప్` కూడా ప్రయోగాత్మక చిత్రమే. మాధవన్ చేస్తున్న`రాకెట్రీ` త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. స్పేస్ నేపథ్యంలో పూర్తి ప్రయోగాత్మక చిత్రం. అబ్ధుల్ కలాం జీవితకథతో అనీల్ సుంకర నిర్మిస్తున్న బయోపిక్ పూర్తి ప్రయోగం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే రిలీజైన అంతరిక్షం- మజిలీ- జెర్సీ ఇవన్నీ ప్రయోగాలే. ఇటీవల నాగచైతన్య చేసిన `మజిలీ`- నాని చేసిన `జెర్సీ` చిత్రాలు ప్రయోగాలే. ఇకపై కూడా ప్రయోగాత్మక చిత్రాలే తెలుగు తెరను ముంచెత్తబోతున్నాయి.
Please Read Disclaimer