క్రిస్మస్ గోల్ మాల్

0

2019 ముగించి 2020కి వెల్ కం చెప్పే టైమొచ్చింది. సరిగ్గా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు చిట్ట చివరి రిలీజ్ సీజన్ గా క్రిస్మస్ వేడెక్కిస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే సినిమాలకు కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. సినిమా బావుందని టాక్ వస్తే చాలు పెద్ద పండగ (సంక్రాంతి) వరకూ ఆడించేయొచ్చన్న ఆశ నిర్మాతల్లో ఉంది.

ఆ క్రమంలోనే క్రిస్మస్ బరిలో ప్రతిష్ఠాత్మకంగా వెంకీ మామను రిలీజ్ చేసే ఆలోచనను డి.సురేష్ బాబు చేస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి వాయిదా వేయించింది ఇందుకేనట. మరో వైపు డిసెంబర్ 20న మూడు నాలుగు సినిమాలు రిలీజవుతుండడం అంతే వేడెక్కిస్తోంది. బాలయ్య- రూలర్.. సాయి తేజ్- ప్రతిరోజు పండగే.. చిత్రాలు ఇప్పటికే డిసెంబర్ 20న రిలీజ్ కి లాక్ అయ్యాయి. ఈ రెండిటిపైనా అభిమానుల్లో అంతో ఇంతో అంచనాలున్నాయి.

వీటితో పాటు కార్తీ నటించిన డబ్బింగ్ చిత్రం దొంగ అదే తేదీకి రానుందట. ఖాకీ- ఖైదీ చిత్రాలతో హిట్లు కొట్టిన కార్తీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతున్నాడు. వీటన్నిటికీ పోటీగా సల్మాన్ భాయ్ నటించిన దబాంగ్ 3ని అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు డి.సురేష్ బాబు రెడీ చేస్తున్నారు. సల్మాన్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇక మెజారిటీ థియేటర్లు సురేష్ బాబు అండ్ కో చేతిలో ఉన్నాయి కాబట్టి దబాంగ్ 3 ఓపెనింగులపైనా భారీ అంచనాలున్నాయి. మరోవైపు వీటితో పాటు హాలీవుడ్ నుంచి స్టార్ వార్స్ సిరీస్ సినిమా ఊహించని పిడుగులా ఊడిపడుతోంది.

స్టార్ వార్స్- ది రైస్ అఫ్ స్కైవాకర్ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయనున్నారట. ఈ సిరీస్ కి మన దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు. అందువల్ల మల్టీప్లెక్సుల్లో మంచి పోటీ ఇస్తుంది ఈ చిత్రం. డిసెంబర్ 24న వెంకీమామ ప్రీమియర్లకు అమెరికా డిస్ట్రిబ్యూటర్లు రెడీ కావాలని సూచించారు కాబట్టి డిసెంబర్ 25న వెంకీమామ రిలీజవుతోందన్న ప్రచారం ఉంది. పనిలో పనిగా ఆ తేదీకి వెంకీమామ రాకపోతే మాత్రం రాజ్ తరుణ్ నటించిన `ఇద్దరి లోకం ఒకటే`ని రిలీజ్ చేసే ప్లాన్ ఉందిట. అయితే డిసెంబర్ 20న ఒకేసారి మూడు నాలుగు రిలీజ్ లు ఉన్నాయి కాబట్టి వీటి ఓపెనింగులకు ఇబ్బందికరమే. ఈ మూడు చిత్రాలు వెంకీమామకు పోటీ అనే భావించాలి. వెంకీమామ డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తే హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ తో పాటు పోటీకి దిగాల్సి ఉంటుంది. క్రిస్మస్ వ్యవహారం చూస్తుంటే అంతా గోల్ మాల్ గోవిందం లానే ఉంది మరి.
Please Read Disclaimer