రివ్యూల పై నిప్పులు చెరిగిన తెనాలి డైరెక్టర్

0

పొగిడితే ఉబ్బితబ్బిబ్బైపోవడం.. తెగిడితే నొచ్చుకోవడం మానవ సహజం. దీనికి ఎవరూ అతీతులు కారు. అలా కాకుండా పొగిడినా తిట్టినా ఒకే విధంగా స్వీకరించడం నిజంగా.. నిజ్జంగా జ్ఞానుల వల్లే అవుతుంది. అలాంటి వారు తక్కువే ఉంటారు. ఇప్పుడు ఈ పొగడ్తలు విమర్శలు టాపిక్ ఎందుకంటే శుక్రవారం వస్తే చాలు సినిమాలు రిలీజ్ అవుతాయి. వెంటనే రివ్యూలు వస్తాయి. మెజారిటీ సందర్భాలలో రివ్యూలు నెగెటివ్ గా ఉంటాయి.. ఎందుకు అంటే పిండి కొద్ది రొట్టె.

వందలో పది సినిమాలే హిట్లు. ఈ లెక్కన పది సినిమాల కే పాజిటివ్ రివ్యూలు వస్తాయి. మిగతా 90 సినిమాలకు నెగెటివ్ రివ్యూలు వస్తాయి. అవి ఫిలిం మేకర్లకు ఎలా నచ్చుతాయి? సహజంగానే ఎవరి సినిమా వారికి ముద్దు కాబట్టి రివ్యూలు నచ్చవు. ఈ శుక్రవారం ‘తెనాలి రామకృష్ణ BA BL’ రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. రివ్యూల విషయం కూడా సేమ్.. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో ఈ రివ్యూలు దర్శకుడు జీ. నాగేశ్వర రెడ్డి గారికి నచ్చ లేదు. రివ్యూల పై ఆయన ఫైర్ అయ్యారు.

రివ్యూల పై నాగేశ్వర రెడ్డి గారి స్పందన ఆయన మాటల్లోనే.. “నేను శంకరా భరణం తీస్తున్నాను.. స్వాతిముత్యం తీస్తున్నాను అని ఎవరికీ చెప్ప లేదు. మేము ఎంటర్టైనర్ తీస్తున్నామని చెప్పాము.. అలానే ఒక కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాము. సినిమా చూసిన ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. థియేటర్లలో హాయిగా నవ్వుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక మీ రేటింగ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రేక్షకులు బ్రహ్మాండంగా నవ్వుతున్నారు.. విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి.. మాకు బ్రహ్మాండం గా డబ్బులు వస్తున్నాయి.. కమీషన్ లు వస్తున్నాయి. మీరు మంచి సినిమా తీశారు.. పబ్లిసిటీ చెయ్యండి అంటున్నారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమేమీ కాదు. ప్రేక్షకుల కంటే గొప్పవాళ్ళం కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం సినిమా ఫీల్డ్ ను నమ్ముకుని బతుకుతున్నాం. మీకు ఏదైనా నచ్చకపోతే రాయొద్దు. కానీ మీరు సినిమాను తిట్టొద్దు. ప్రేక్షకుల కు నచ్చింది అది మాకు చాలు. అలా అని నేను అందరూ రివ్యూయర్ల గురించి మాట్లాడడం లేదు. యాభై శాతం మంది రివ్యూయార్లు మా సినిమా గురించి చాలా బాగా రాశారు. వారికి కృతజ్ఞతలు” అంటూ తన వాదన వినిపించారు.
Please Read Disclaimer