విమర్శించినా కూడా థమన్ కే మహేష్ ఓటు?

0

మొన్నటి సంక్రాంతి రేసు భలే రంజుగా సాగింది. మహేష్ ‘సరిలేరు’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ సినిమాలు పందెంకోళ్లుగా పోటీపడ్డాయి. కానీ అల వైకుంఠపురం విజయం సాధించింది. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు సగం విజయాన్ని కట్టబెట్టింది.

ఈ నేపథ్యంలో ‘అల వైకుంఠపురం’ సినిమా విజయోత్సవాలలో ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్లు ఫేక్ అంటూ సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. థమన్ పై మహేష్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఏకిపారేశారు. ట్రోల్ చేశారు. మహేష్ బాబు ఈ విషయంలో సీరియస్ గా ఉంటారని అంతా అనుకున్నారు. ఇక తన సినిమాల్లో ఎప్పుడూ అవకాశం ఇవ్వడని అంతా అనుకున్నారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

మహేష్ బాబు-పరుశురాం తాజా చిత్రం ‘సర్కార్ వారి పాట’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది నిజంగా ఎవరూ ఊహించనది. పరుశురాంతో ఇది వరకు గీతాగోవిందం సినిమాకు చేసిన గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ అని అంతా అనుకుంటే.. థమన్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం విశేషం.

ప్రస్తుతం థమన్ తన జీవితంలోనే అత్యంత పీక్ స్టేజీలో ఉన్నారు. ‘అల వైకుంఠపురం’ వకీల్ సాబ్ లాంటి చిత్రాలకు మైండ్ బ్లోయింగ్ సంగీతం అందించాడు. పరిశ్రమలో ఎవరైతే పీక్స్ లో ఉంటారో.. అత్యుత్తమంగా పనిచేస్తారో వారికే అవకాశాలు దక్కుతాయి. అందుకే తనపై విమర్శలు చేసినా కూడా మహేష్ బాబు తన చిత్రానికి థమన్ నే ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కోపతాపాలు లేవని.. కంటెంట్ ఉన్నోడికే అగ్రతాంబూలం అని మరోసారి రుజువైంది.

దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఇప్పుడు థమన్ ను యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో అతడు చేసిన కామెంట్స్ ను మరిచిపోయేలా చేసింది ఈ డీల్. ఇప్పుడు మహేష్ సినిమాకు థమన్ అందించే సంగీతమే అతడిపై అపప్రదను తొలగిస్తుంది. మరి థమన్ ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.

పరుశురాం ఈసారి మహేష్ తో సినిమా కోసం మంచి టీంను ఎంచుకున్నాడు. దేశం గర్వించే జాతీయ అవార్డ్ పొందిన సినిమాటోగ్రఫర్ పీఎస్ వినోద్ ను కెమెరామెన్ గా ఎంచుకున్నాడు. ఇక ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాన్ని అప్పగించాడు. మార్తాండ్ కే వెంకటేశ్ కు ఎడిటింగ్ బాధ్యతలు ఇచ్చాడు. మైత్రీ 14 రీల్స్ మహేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer