తంబి అంటున్న కార్తి.. పవన్ టైటిలేనా?

0

పాత సినిమాల టైటిల్స్ కొత్త సినిమాలకు పెట్టుకోవడం అనే ట్రెండ్ ఈమధ్య ఊపందుకుంది. ‘నర్తనశాల’ లాంటి క్లాసిక్ టైటిల్స్ నుంచి.. ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సూపర్ మాస్ టైటిల్స్ వరకూ మన మేకర్స్ ఏ పాత టైటిల్ ను కూడా వదలడం లేదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన ‘ఖైది’ టైటిల్ ను కార్తి తన కొత్త సినిమాకు వాడుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాల టైటిల్స్ ఇలా ఇతర హీరోలు వాడుకోవడంపై మెగా ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి ఉంది. అయితే హీరోలు మాత్రం వాటిని పట్టించుకోకుండా మెగాస్టార్ టైటిల్స్ ను వాడేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కార్తి మరో మెగా టైటిల్ పై కన్నేసినట్టు ప్రచారం సాగుతోంది. కార్తి ప్రస్తుతం ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తి వదినమ్మ జ్యోతిక మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అక్కగా జ్యోతిక.. తమ్ముడిగా కార్తి నటిస్తారట. కథకు తగ్గట్టు ఈ సినిమాకు తమిళంలో ‘తంబి’ అనే టైటిల్ నిర్ణయించారు. తంబి అంటే తెలుగులో తమ్ముడు.. కార్తి సినిమాలు ఎలాగూ తెలుగులో రిలీజ్ అవుతాయి కదా.. అప్పుడు ఈ సినిమాకు ఆటోమేటిక్ గా తమ్ముడు అనే టైటిల్ పెట్టేస్తారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘తమ్ముడు’. ఈమధ్య మెగాస్టార్ టైటిల్ ‘ఖైదీ’ని వాడుకున్న కార్తి ఇపుడు పవర్ స్టార్ ‘తమ్ముడు’ టైటిల్ ను వాడుకుంటాడేమో అనేది ఇపుడు మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నాని.. కార్తి తరహాలో ఇతర హీరోలు కూడా చిరు.. పవన్ సినిమాల టైటిల్స్ వాడేయడం మొదలు పెడతారనే వాదన వినిపిస్తోంది.
Please Read Disclaimer