ఓటీటీ లోకంలో డైరెక్టర్స్ కళల కలలు

0

“కళ అంటే బతుకుని ఇచ్చేదే కాదు.. బతుకుని నేర్పేది కూడా“.. `కృష్ణం వందే జగద్గురుమ్` చిత్రం కోసం బుర్రా సాయిమాధవ్ రాసిన డైలాగ్ ఇది. నిజమే కరోనా కల్లోలంలో ఉపాధి కరువై అల్లకల్లోలం అవుతున్నా కొందరు అందులో కూడా ఉపాధిని వెతుక్కునేందుకు నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఆశ్చర్యపరుస్తోంది.

`దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు` అని పూరి చెప్పినట్టు .. ఆయన ఈపాటికే ఈ బాటలోనే ఉన్నాడు. డిజిటల్ – వెబ్ సిరీస్ లపై దృష్టి సారించాడు. శిష్యులకు దర్శకులుగా అవకాశాలిస్తూనే ఆయనే స్క్రిప్టులు అందిస్తూ స్వీయ నిర్మాణంలో వెబ్ సిరీస్ లను రూపొందించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఇక సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా వెబ్ సిరీస్ స్క్రిప్టులపై దృష్టి సారించారరని కథనాలొచ్చాయి.

వీళ్లతో పాటు మారుతి.. అనీల్ రావిపూడి సైతం ఈ విభాగాన్ని విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే సుకుమార్ సహా మారుతి .. రావిపూడి వంటి యువదర్శకులు అల్లు అరవింద్ ఓటీటీ `ఆహా-తెలుగు` కోసం స్క్రిప్టులు రాసే పనిలో ఉన్నారు. డిజిటల్ కళ ఇప్పుడు వీళ్లందరికీ ఆల్టర్నేట్ ఎర్నింగ్ సోర్స్ గా మారిపోయింది. ఇది కొత్త ప్రతిభకు అవకాశాలిస్తోంది. నటీనటులు సహా టెక్నీషియన్లకు ఉపాధినిస్తోంది.

మరో టాప్ రేంజ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెబ్ సిరీస్ స్క్రిప్టులపై దృష్టి సారించారని తెలిసింది. పూరి – సురేందర్ రెడ్డి- సుకుమార్ లాంటి టాప్ రేంజ్ డైరెక్టర్లే ఇంత ఆసక్తి చూపిస్తుంటే వీళ్లు ఇచ్చిన స్ఫూర్తితో పలువురు యువదర్శకులు వెబ్ సిరీస్ బాట పడుతున్నారని తెలిసింది.

ఇటీవలి కాలంలో కాస్టింగ్ సెలెక్షన్స్ పరంగా కూడా వెబ్ సిరీస్ లు టాప్ ట్రెండింగులో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కృష్ణానగర్ .. ఫిలింనగర్ లో ఎందరో అనామకంగా వెబ్ సిరీస్ ప్రకటనలు చేస్తూ ఆర్టిస్టుల్ని ఎంపిక చేసుకోవడం చూస్తుంటే.. ఈ ట్రెండ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాగే ఓటీటీతో పాటు ఏటీటీ (చిన్న సైజు) కూడా అందుబాటులోకి రావడంతో ఎవరికి వారు క్రియేటివిటీ చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే సినిమా అయినా.. వెబ్ సిరీస్ అయినా ఏటీటీ అయినా కంటెంట్ లో దమ్ముండాలి. గ్రిప్పింగ్ కంటెంట్ తో మెప్పిస్తేనే మనుగడ ఉంటుంది ఈ వేదికపై. తాజా సన్నివేశం పలువురు చిన్న నిర్మాతలకు కలిసొస్తోంది. థియేటర్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా లేకపోవడంతో ఓటీటీ- డిజిటల్ పైనే అంతా ఆసక్తిని కనబరుస్తుండడం అవకాశాల్ని పెంచుతోంది. కళ అనేది ప్రతిభను ఇలా ప్రోత్సహిస్తూ కలకాలం వర్ధిల్లాలి… కష్ట కాలంలోనూ!!Please Read Disclaimer