మాజీ హీరోయిన్ పెద్ద సాహసమే

0

చాలామంది హీరోయిన్లలా గ్లామర్ లుక్స్ లేకపోయినా.. కథానాయికగా చాలా సినిమాలే చేసింది కళ్యాణి. హోమ్లీ లుక్తో కనిపించే ఆమె ఒక సమయంలో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు పెదబాబు వసంతం లాంటి సినిమాల్లో మెరిసిన ఆమె.. దర్శకుడు సూర్యకిరణ్ను పెళ్లాడాక కథానాయిక పాత్రలకు దూరమైంది. ఆ తర్వాత అడపా దడపా వదిన తరహా పాత్రలు కొన్ని చేసింది. ఇప్పుడు కళ్యాణి అసలు లైమ్ లైట్లో లేదు. సూర్యకిరణ్ నుంచి కొన్నేళ్ల కిందటే విడిపోయిన కళ్యాణి.. ఇప్పుడు పెద్ద సాహసానికి సిద్ధమవుతోంది. ఆమె స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తోంది.

కే2కే పిక్చర్స్ పేరుతో కొత్త బేనర్ పెట్టి తన కథ తయారు చేసుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తోంది కళ్యాణి. రాజు గారి గది సహా కొన్ని సినిమాల్లో నటించిన చేతన్ చీను ఇందులో హీరో అట. ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో రూపొందించనుందట కళ్యాణి. ముందు తెలుగు సినిమాగానే అనుకున్నానని.. లాక్ డౌన్ టైంలో స్క్రిప్టు డెవలప్ చేసి మల్టీ లాంగ్వేజ్ మూవీగా మార్చానని కళ్యాణి అంటోంది. సీతారామశాస్త్రి చంద్రబోస్ భాస్కరభట్ల లాంటి పేరున్న లిరిసిస్టులతో పాటలు రాయించుకుంటున్న కళ్యాణి.. అచ్చు రాజమణిని సంగీత దర్శకుడిగా ఎంచుకుంది. కాకపోతే కాస్త పేరున్న హీరోను పెట్టుకుని ఇలాంటి సాహసాలు చేస్తే బాగుండేది. పైగా ఎవరైనా నిర్మాతను చూసుకోకుండా సొంతంగా డబ్బులు పెట్టుకుని దిగుతుండటంతో కళ్యాణికి ఈ సినిమా ఎలాంటి అనుభవం మిగులుస్తుందో ఏమో అనిపిస్తోంది.