యువజంటకు బిగ్ బాస్ నేర్పిన పాఠం?

0

బిగ్ బాస్ లో ఫేమస్ అయితే సినిమా స్టార్ గా అవకాశాలు పెరుగుతాయన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పటివరకూ ఎంతమందికి బిగ్ బాస్ రియాలిటీ షో కలిసొచ్చింది? అన్నది ఆరాతీస్తే మాత్రం తెలిసిన నిజం నిశ్చేష్టుల్ని చేస్తోంది. బిగ్ బాస్ లో పాపులరైతే అవకాశాలొస్తాయి. అయితే అది బాలీవుడ్ లాంటి చోట.. ఇక్కడ కాదు అని ప్రూవైంది. అటు తమిళంలోనూ ఓవియా లాంటి ఎవరికో కానీ పెద్దంతగా అవకాశాలు ఊడిపడలేదు. విచ్చలవిడిగా ఎక్స్ పోజ్ చేసే హిందీ రియాలిటీ షో వల్ల అక్కడ వారికి మాత్రం కొన్ని ఆఫర్లు వచ్చిన మాట వాస్తవం.

ఇక తెలుగులో వెండితెర ఛాన్సులేవైనా వెంటపడ్డాయా.. అంటే! అంత గొప్ప సన్నివేశం ఇక్కడ కనిపించలేదు. బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే మూడు సీజన్లు ముగిశాయి. అయినా బిగ్ బాస్ 1.. 2..3 లో ఇంటి సభ్యులుగా ఉన్న ఎవరికీ సరైన అవకాశాలు రాలేదు. దీంతో బిగ్ బాస్ అన్న హోప్ కూడా చాలామందిలో సన్నగిల్లింది. ఈ రియాలిటీ షోలో పాల్గొంటే కేవలం ప్యాకేజీ ఏదైనా ముడుతుందని లేదా బుల్లితెర వీక్షకులకు చేరువ కావొచ్చని మాత్రమే హోప్ పెట్టుకోవాలని ప్రూవ్ అయ్యింది. ఇంతకుముందు బిగ్ బాస్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఏకంగా సామాజిక మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ పేరుతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడం ఆసక్తికరం. అలాంటి సంచలనం సృష్టించిన విన్నర్ కే తికాణా లేదిక్కడ. అలాగే హరితేజ లాంటి స్టార్ ఇమేజ్ వచ్చిన నటికి అవకాశాల్లేవ్.
కనీసం క్యారెక్టర్ నటిగా బిజీ అవుతుంది అనుకుంటే అదీ లేదు. ఇక బిగ్ బాస్ 1లో కనిపించి ఎంతో ఈజ్ చూపించిన కథానాయిక అర్చన సైతం పెళ్లితో సెటిలై నటనకు కామా పెట్టేసింది. ఇక తనీష్ లాంటి యంగ్ హీరోకి అసలు బిగ్ బాస్ సాయపడిందేమీ లేదు.

మొన్ననే ముగిసిన `బిగ్ బాస్ 3` హౌస్ మేట్స్ పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. ఇందులో ఎంతో రచ్చ చేసిన శ్రీముఖి తిరిగి యాంకరింగుకే పరిమితం. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ ప్రస్తుతానికి మీడియా ఇంటరాక్షన్స్ కి మాత్రమే అంకితమయ్యాడు. ఇక స్టార్ కపుల్ గా ఇంట్లో హీట్ పెంచిన వరుణ్ సందేశ్- వితిక షేరు జంట పరిస్థితి మినహాయింపేమీ కాదు. వరుణ్ సందేశ్ పెద్ద స్టార్ గా వెలిగి కెరీర్ పరంగా డౌన్ ఫాల్ అయ్యాడు. ఫ్లాపులు ఇబ్బంది పెట్టడంతో కెరీర్ పరంగా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే దాని నుంచి బయటపడేందుకు అతడు చేసిన ఏ ప్రయత్నం సఫలం కాలేదు. కనీసం బిగ్ బాస్ అయినా ఇమేజ్ పెంచుతుందని భావించాడు. షో ముగిసి బయటికి వచ్చినా.. ఇప్పటివరకూ వరుణ్ నుంచి సరైన ప్రకటన ఏదీ రాలేదు. ఇంతకుముందు మీడియా ఇంటర్వ్యూల్లో తనకు ఈసారి అవకాశాలు పెరుగుతాయనే భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ ఇప్పటివరకూ ఫలానా కొత్త సినిమా లాంచవుతోంది అన్న ప్రకటన అయితే రాలేదు. వితిక శేరు మాత్రం ప్రస్తుతం `ఉర్మి` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అందం చందం ప్రతిభ ఉన్న నటి వితిక. మునుముందు ఏవైనా అవకాశాలు దక్కుతాయేమో చూడాలి. వరుణ్ అయినా వితికా అయినా.. రాహుల్ అయినా కౌశల్ అయినా గేమ్ ఛేంజర్స్ కావాలంటే అంతకుమించి అతీతంగా ఏదైనా చేయాల్సి ఉంది. అప్పటివరకూ ఇంతేనేమో!!
Please Read Disclaimer