ఆగస్టులో థియేటర్లు తెరిస్తే రిలీజ్ ప్లాన్ ఎలా?

0

ఆగస్టు నుంచి థియేటర్లు.. జిమ్ లు తెరుచుకునే వీలుంటుందని కేంద్రం ప్రకటించనుందని ప్రచారమవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారా? ఇప్పటికే పెండింగులో ఉన్న రెండు డజన్ల సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతల గిల్డ్ లేదా నిర్మాతల మండలి ప్లాన్ ఏమిటి? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

అనుష్క `నిశ్శబ్ధం`- నాని.. సుధీర్ ల `వీ`- రానా ఆరణ్య- వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` చిత్రాలు రిలీజ్ లకు రెడీ అయితే ఇంకా కొందరు రిలీజ్ క్యూలో ఉన్నారని తెలుస్తోంది. కొన్ని ఇప్పటికే చిత్రీకరణలు ముగించి నిర్మాణానంతర పనుల్లో ఉండగా.. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నవి ఉన్నాయి. వీళ్లంతా ఆగస్టు రిలీజ్ లకు రెడీ అవుతారా? అంటే .. ఇంకా ఎన్నో సందిగ్ధతలు నెలకొన్నాయి. క్రాక్- సోలో బ్రతుకే సో బెటర్- శ్రీకారం- లవ్ స్టోరీ- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి చిత్రాలు సెప్టెంబర్ నాటికి చిత్రీకరణలు పూర్తి చేసుకుని అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.

తాంబూలం పంచేశాం తన్నుకు చావండి! అన్నట్టు ఆగస్టు నుంచే థియేటర్లు తెరిచేస్తే ఆ తర్వాత కోవిడ్ 19 రూల్స్ పాటిస్తూ థియేటర్ యాజమాన్యాలు థియేటర్లను తెరవాల్సి ఉంటుంది. పైగా సగం సీట్లలో జనం కూచోడానికి ప్రభుత్వ నియమం ఒప్పుకోదు. అంటే సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లను రన్ చేయాల్సి ఉంటుంది. పైగా కుర్చీల శానిటైజేషన్.. థియేటర్ లో ప్రతి షో తర్వాత శానిటైజేషన్ అంటే ఆ ఖర్చు యాజమాన్యాలకు తడిసిమోపెడు అవుతుంది. దానిని కూడా ప్రేక్షకుడి టిక్కెట్టుపైనే బాదితే జనం వస్తారా? అందుకే ఇలాంటి కండీషన్స్ నడుమ థియేటర్లను ఓపెన్ చేసే కంటే మూసుకోవడమే బెటర్ అన్న ఆలోచనతో ఎగ్జిబిటర్లు ఉన్నారట.

పైగా కరోనా భయాలతో జనం థియేటర్ల వైపు రాకపోతే పరిస్థితి ఏమిటన్న బెంగా ఎగ్జిబిటర్ ని నిలవనీయడం లేదు. ఇలాంటప్పుడు కేంద్రం అనుమతులు ఇచ్చినా ఏం ఉపయోగం? అన్న ప్రశ్న తలెత్తింది. ఇంకో ట్విస్టేమంటే థియేటర్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే ఆ థియేటర్ ని మూసివేయాలి! అంటూ మర్గదర్శకాల్లో పొందుపరుస్తారట. అన్నట్టు ఆ ఒక్కడితో థియేటర్ లో సమూహాలకు కరోనా సోకితే పరిస్థితేమిటో?