రాహుల్ నైట్ లైఫ్ లో అంత ఫన్ ఉంటుందట

0

బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చే ముందు రాహుల్ సిప్లిగంజ్ చాలా తక్కువ మందికే తెలుసు. షో ప్రారంభమయ్యాక.. అందులో పునర్నవి ఎపిసోడ్ తో అతడు ఫేమస్ అయిపోయాడు. చివరకు బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. దీంతో అతగాడి ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. హైదరాబాద్ విజయనగర్ కాలనీలో అద్దెకు ఉండే అతగాడి ఇంటి దగ్గర హడావుడి ఇప్పుడు అంతా ఇంతా కాదన్నట్లుగా ఉందట. అభిమానులతో అక్కడ పోటెత్తుతోందట.

ఇంట్లో నుంచి బయటకు రావటానికి కూడా మస్తు అవస్థలు పడాల్సి వస్తోందని రాహుల్ చెబుతున్నాడు. షో అయ్యాక అభిమానుల తాకిడి పెరిగి.. ఇంట్లో నుంచి బయటకు రాలేక వెనుక నుంచి గోడ దూకి బయటకు రావాల్సి వస్తోందని చెబుతున్నాడు.

పునర్నవి తనకు స్పెషల్ అని.. తమ మధ్య ప్రేమ లేదని తేల్చేశాడు. ఒకవేళ ఉంటే ఓపెన్ గా చెప్పే ధైర్యం ఉందన్న రాహుల్.. తాను వేరే అమ్మాయితో లవ్ లో ఉన్న విషయాన్ని వెల్లడించాడు. ఆమె వివరాలు తాను చెప్పలేనని.. తాను చేసుకునేది లవ్ మ్యారేజ్ అని స్పష్టం చేశాడు. ఇక.. తనకున్న స్నేహితుల గురించి చెబుతున్న రాహుల్.. తాను నైట్ లైఫ్ లో మస్తు ఎంజాయ్ చేస్తానని చెబుతున్నాడు.

దేశంలో ఎక్కడా లేని అందాలన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయని.. అందునా పాతబస్తీ అందాలు అన్ని ఇన్ని కావని చెబుతున్నాడు. తాను..తన ఫ్రెండ్స్ అందరూ కలిసి రాత్రివేళ పాతబస్తీలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంటామని.. ఇలాంటి ఆనందం మరే సిటీలోనూ ఉండదని చెబుతున్నాడు.

పాతబస్తీలోని బిస్మిల్లా హోటల్ లో మలైపాయ తినటం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. వారంలో నాలుగైదుసార్లు అర్థరాత్రి రెండు గంటల వేళలో తన స్నేహితులతో కలిసి పాతబస్తీకి వెళ్లి మలైపాయ తింటానని.. అది తింటుంటే ఆహా.. ఏం టేస్ట్ అన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. మల్లేపల్లి డైమండ్ హోటల్ లో ఇరానీ చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్టటం కూడా బాగా ఇష్టమని చెబుతున్నాడు. మొన్నటి వరకూ అర్థరాత్రి 2 గంటలు దాటిన తర్వాత పాతబస్తీకి వెళ్లి తనకు నచ్చింది తినే రాహుల్ కు.. సెలబ్రిటీ ఇమేజ్ లోనూ అలా చేయగలడా? అన్నది కాలమే చెప్పాలి.
Please Read Disclaimer