వర్మ ఆఫీస్ కి వచ్చిన ‘పవర్ స్టార్’…!

0

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ నిన్న ‘నగ్నం’ అనే సినిమా ‘ఆర్జీవీ వరల్డ్’ థియేటర్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిన్న సినిమా ఎలా ఉన్నా వర్మకి డబ్బులు మాత్రం బాగానే తెచ్చిపెట్టిందని సమాచారం. ఈ క్రమంలో వర్మ సోషల్ మీడియా వేదికగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆర్జీవీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ”బ్రేకింగ్ న్యూస్: ‘ఆర్జీవీ వరల్డ్’ లో నా తదుపరి చిత్రం ‘పవర్ స్టార్’.. ఈ సినిమాలో PK MS NB TS మరియు ఒక రష్యన్ మహిళ – నలుగురు పిల్లలు – 8 గేదెలు మరియు RGV నటించనున్నారు. ఆర్జీవీ ‘పవర్ స్టార్’లోని ఈ పాత్రలు ఎవరో అర్థం చేసుకున్నప్పటికీ బహుమతులు ఇవ్వబడవు” అని ట్వీట్ చేసారు. అంతేకాకుండా ‘పవర్ స్టార్’ సినిమాలో లీడ్ రోల్ లో నటించే యాక్టర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసారు.

దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేసిన వర్మ ”నా కొత్త చిత్రం POWER STAR సినిమాలో స్టార్ ఇతనే… అతను నా ఆఫీస్ కి వచ్చినప్పుడు ఈ షాట్ తీయబడింది.. మరే వ్యక్తితోనైనా పోలిక యాదృచ్చికంగా మరియు ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా ఉండొచ్చు” అని ట్వీట్ చేసారు. ఈ వీడియోలో ఉన్న ఆర్టిస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోలి ఉన్నాడు. ‘అత్తారింటికి దారేదీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ ధరించి అతని మేనరిజంతో నడుస్తూ ఉన్న ఈ వీడియోకి అదే సినిమాలోని సాంగ్ ఒకటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా వస్తోంది. ఈ వీడియోలో అతన్ని చూసిన వారు కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి డూప్ గా ఉన్నాడని అనుకోకమానరు. ఇంతకముందు ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని వర్మ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ‘పవర్ స్టార్’ సినిమా పవన్ కళ్యాణ్ గురించి అని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటికీ ఆయన ట్వీట్స్ మరియు ఈ వీడియో చూస్తుంటే డౌట్ వస్తుందని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వర్మ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Please Read Disclaimer