అడివి శేష్ `మేజర్`కి పోటీనా ఇది?

0

టాలీవుడ్ లో ఒక్కో అడుగు సైలెంట్ గా వేస్తూ వరుసగా విజయాల్ని ఖాతాలో వేసుకుంటున్నారు యంగ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్. ప్రతిసారీ గ్రాఫ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే రిలీజైన `ఎవరు` బక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధించిందని రిపోర్ట్ అందింది. ఈ సినిమాకి రెండోవారంలోనూ ప్రమోట్ చేస్తూ వసూళ్లు పెరిగేందుకు శేష్ బృందం చేయని ప్రయత్నం లేదు. క్షణం- గూఢచారి-ఎవరు ఇవన్నీ ఆడియెన్ ని థ్రిల్ కి గురి చేశాయి. అందుకే సక్సెస్ ని అందించారు. మరి ఈసారి శేష్ ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు? అంటే.. మునుముందు అతడి లైనప్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తోంది.

తదుపరి `మేజర్` అనే బయోపిక్ చిత్రంలో శేష్ నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 26/11 ఉగ్రదాడుల్లో తీవ్రవాదులకు ఎదురెళ్లి ప్రజల ప్రాణాల్ని కాపాడిన ఎన్.ఎస్.జీ కమెండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ నటించనున్నారు. సముద్ర మార్గం గుండా రహస్యంగా దేశంలో ప్రవేశించిన పాక్ ముష్కర తీవ్రవాదులు ముంబై తాజ్ హోటల్.. ఛత్రపతి టెర్మినల్ సహా పలు చోట్ల దారుణ మారణకాండ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోరమైన ఎటాక్ నుంచి కొందరిని కాపాడేందుకు సందీప్ ఉన్నికృష్ణన్ చూపించిన ధైర్య సాహసాలు ఎంతో గొప్పవి. ఈ మారణ హోమంలో ఆయన ప్రాణాల్ని కోల్పోయి అమరవీరుడయ్యారు. అతడి మరణానంతరం భారత ప్రభుత్వం అశోక చక్ర బిరుదుని ఇచ్చి గౌరవించింది. అందుకే అలాంటి సాహసి కథలో శేష్ నటిస్తున్నారు అనగానే ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా తర్వాత శేష్ బ్లాక్ బస్టర్ మూవీ `గూఢచారి` సీక్వెల్ లో నటించనున్నారు.

మరోవైపు బాలీవుడ్ లోనూ ఇదే తరహాలో మరో దేశభక్తి ప్రధాన బయోపిక్ చిత్రాన్ని నిర్మించేందుకు స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ సన్నాహాలు చేస్తున్నారు. కశ్మీర్- పుల్వామా జిల్లా బాలాకోట్ స్ట్రైక్స్ నేపథ్యంలో `బాలాకోట్: ది ట్రూ స్టోరీ` పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. పాక్ భూభాగంలో ప్రవేశించి ముష్కర తీవ్రవాదుల్ని ఏరివేసిన భారత వైమానిక దళాలు నాటి ఆపరేషన్ ని ఎలా సాగించాయి? అన్న కథాంశాన్ని ఎంచుకుని .. ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం పాక్ భూభాగంలో శత్రువుకు చిక్కిన ఎయిర్ ఫోర్స్ అధికారి.. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కథను సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. అభినందన్ పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కశ్మీర్ లోని ఒరిజినల్ లైవ్ లొకేషన్లలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. జమ్ము కశ్మీర్- దిల్లీ-ఆగ్రాలో తెరకెక్కిస్తారు. ఇంకా నటీనటుల్ని ఎంపిక చేయాల్సి ఉంది. దర్శకుడిని ఎంపిక చేయాల్సి ఉంది. ఏడాది చివరిలో సినిమాని ప్రారంభిస్తున్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన ఇద్దరు గొప్ప సాహసికుల జీవితాల్ని వెండితెరపై చూపించాలనే ప్రయత్నం ఎంతో గొప్పది. ఈ ప్రయత్నంలో శేష్- మహేష్ బృందం.. ఒబేరాయ్ బృందం ఏమేరకు సఫలం అవుతారన్నది వేచి చూడాలి.
Please Read Disclaimer