థియేటర్ల మూతేనా..షూటింగ్ లూ బంద్!

0

కరోనా దెబ్బ అబ్బా అనిపించేస్తోంది. ఇతర రంగాల్లానే వినోద రంగాన్ని తునాతునకలు చేస్తోంది. ఓవైపు రిలీజ్ లు బంద్.. థియేటర్లు బంద్.. అంటూ వేడెక్కించేస్తుంటే.. మరోవైపు షూటింగులు కూడా ఆపేస్తున్నామంటూ ప్రకటించి టాలీవుడ్ బిగ్ షాక్ ఇచ్చింది.

తాజా సన్నివేశం చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్ ఎవరికి వారు ప్రకటించేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు.. పరిశ్రమ బాధ్యత అన్నట్టుగా ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారని భావించాలి. ఈ రోజు జరిగిన ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ లో వాలంటీర్ గా అందరూ మార్చి 21 వరకు షూటింగ్ లు కూడా ఆపాలని నిర్ణయించారు. ఆ మేరకు పెద్దలంతా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపారు. అంటే వారం పాటు ఆల్ షూటింగ్స్ బంద్ అన్న మాట. కార్మికులు ఎవరూ ఇక సెట్స్ కి వెళ్లకుండా స్వచ్ఛందంగా సెలవులు తీసుకున్నట్టే.

తిరిగి తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ చేయటానికి అనుమతి ఇచ్చాకే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. అలాగే థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వాలే తేదీ నిర్ణయిస్తాయని కూడా ఈ మీటింగులో ముచ్చటించుకున్నారు. ప్రభుత్వాలకు పరిశ్రమ వర్గాల నుంచి అద్భుత సాయం అందుతుండడం హర్షణీయం. ఇకపోతే థియేటర్ల బంద్ వల్ల పరిశ్రమకు ఎంత నష్టం? అన్నది ఇంకా అంచనా వేయాల్సి ఉంటుంది. అలాగే వారాలకు వారాలు షూటింగులు బంద్ చేస్తే కార్మికులకు తిండి దొరకడం కష్టమే. ఇక్కడ ఏరోజుకారోజు భత్యం లేనిదే బతకలేని సన్నివేశం ఉంటుంది. లైట్ మన్లు.. స్పాట్ బోయ్ నుంచి ప్రతి ఒక్కరికి ఫుడ్డు కష్టమే. ఇలాంటి కష్టం నష్టంలో ప్రభుత్వం తరపున కానీ.. ఎఫ్.డీ.సీ తరపున కానీ.. మా అసోసియేషన్.. నిర్మాతల మండలి నుంచి కానీ ఏదైనా చిరు సాయం అందేలా చేస్తే కొంతవరకూ బావుంటుందేమో!! వారం పదిరోజుల వరకూ ఓకే కానీ.. దాటితే మాత్రం వీళ్లంతా సాయానికి ముందుకు వచ్చి తీరాల్సిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-