ప్రియాంక హత్యపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందన ..!

0

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన పై సామాన్యుల నుండి అన్ని రంగాలకి చెందిన వారు స్పందిస్తున్నారు. ఒక ఆడపిల్ల రాత్రి సమయంలో ఒంటరిగా ఉంటే ఒక అన్నలా తోడునివ్వాల్సింది పోయి ..అతి కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడి – ఆ తరువాత అత్యంత క్రూరంగా పెట్రోల్ – కిరోసిన్ పోసి హత్య చేసారు. ఇలాంటి దారుణాలపై కఠిన చట్టాలు – నిందితులపై చర్యలు కేవలం కంటి తుడుపు చర్యలుగా మిగిలిపోతున్నాయి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వాడి తల అక్కడే తెగనరికే రోజు రావాలని కోరుకుంటున్నారు.

అత్యంత బాధాకరమైన ఈ దారుణ హత్యా పై టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించారు. పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయావుతున్నాయని – ప్రియాంక రెడ్డి హత్య తెలియగానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని – తాను అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్ లో ఇంత దారుణ ఘటన జరగడం చాలా బాధ కలిగించిందని – ప్రియాంక మృతికి సంతాపం తెలిపారు హీరోయిన్ కీర్తి సురేశ్. నేను కర్మను నమ్ముతానని – అది ఎల్లవేళలా పనిచేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హంతకులను ఉరి తీయాలని – ప్రియాంక హత్య గురించి తెలియగానే నాకు గుండె పగిలినంతపనైందని హీరోయిన్ రాశిఖన్నా అన్నారు. మన ఈ సమాజం ఎటుపోతుందో అని ప్రశ్నించారు.

ప్రియాంక హత్య పట్ల హీరోయిన్ లావణ్య త్రిపాఠి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక అమ్మాయిని ఇంత కిరాతంగా చంపుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలని ఆమె ట్విట్టర్ ద్వారా ప్రియాంక కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేసారు. ప్రియాంక హత్య వార్త గురించి తెలియగానే షాక్ కు గురయ్యానని మరో హీరోయిన్ మెహ్రీన్ తెలిపారు. అలాగే డాక్టర్ ప్రియాంకరెడ్డి తన చెల్లితో మాట్లాడిన చివరి ఫోన్ కాల్ హృదయాన్ని మెలిపెట్టేలా ఉందని హీరోయిన్ దివ్యాంషా కౌశిక్ తెలిపింది. రాత్రి సమయాల్లో యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. చాలా బాధాకరం. ‘ఈ దారుణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసంలో భాగంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలి. ఆడ పిల్లలతో ఎలా మెలగాలి – వారిని ఎలా కాపాడాలనే దాని గురించి బాలురకు శిక్షణ ఇవ్వాలి. ఇటువం‍టి చర్యలతోనే వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. సారీ ప్రియాంక’ అంటూ ప్రముఖ గాయని స్మిత ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంది.

ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం – కిరాతకం వంటి మాటలు కూడా సరిపోవని హీరో అల్లరి నరేశ్ అన్నారు. ఈ వార్త విని చాలా బాధపడ్డానని తెలిపారు. దేశంలో ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదని అందరిని హెచ్చరించారు. అలాగే ఆడపిల్లలు ఏ ఆపద సమయంలో అయిన పోలీసుల సహాయం తీసుకోవాలని హీరో సుధీర్ బాబు సూచించారు. లైవ్ లొకేషన్ యాప్స్ – అత్యవసర ఫోన్ కాల్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలన్నారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. హంతకులను అరెస్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని దర్శకుడు వివి వినాయక్ డిమాండ్ చేశారు. ప్రియాంక హత్య గురించి తెలియగానే తనకు బాధ – కోపం – నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయని హీరో అల్లు శిరీష్ తెలిపాడు. అదే సమయంలో మహిళలు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




Please Read Disclaimer