యాసను ప్రయోగించడంలో మొనగాళ్లు

0

దేశ భాషలందు తెలుగు లెస్స! మన భాషలో ఉన్నన్ని ప్రయోగాత్మక పదాలు కానీ.. భాషను ప్రజలు మాట్లాడే తీరులో వేరియేషన్ కానీ వేరే ఏ భాషలోనూ ఉండదు. ఆ సంగతిని ఇరుగు పొరుగు భాషల నుంచి వచ్చి తెలుగు నేర్చుకునేవాళ్లు చెబుతుంటారు. నైజాం యాస.. రాయలసీమ యాస.. ఉత్తరాంధ్ర యాస.. శ్రీకాకుళం యాస.. ఇలా రకరకాల యాసలు ఉన్నాయి. అయితే ఈ యాసను భాషను సంస్కృతిని సినిమాల్లోకి తేవడంలో మన దర్శకులెంతో ఘనాపాటీలు.

సీనియర్లలో పూరి జగన్నాథ్- సుకుమార్- శేఖర్ కమ్ముల-త్రివిక్రమ్ వంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్లంతా భాషను యాసను ప్రయోగాత్మకంగా ఉపయోగించుకున్నారు. ఉత్తరాంధ్ర వాసిగా పూరి వైజాగ్ యాసను ప్రయోగిస్తుంటాడు. అతడు తీసిన ఇస్మార్ట్ శంకర్ లో నైజాం యాస ఒక ట్రెండ్ అయ్యింది. హ్యాపీడేస్ లో నైజాం యాసతో పాటు శ్రీకాకుళం యాసను ప్రయోగించాడు శేఖర్ కమ్ముల. సాయి పల్లవి నైజాం యాస కమ్ముల `ఫిదా`కి పెద్ద ప్లస్. రంగస్థలంలో గోదారి యాసతో అద్భుతాలు చేసిన సుకుమార్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఏఏ 20 చిత్రంలో చిత్తూరు యాసను సీమ యాసను ప్రయోగాత్మకంగా చూపించనున్నాడు.

కేవలం సుకుమార్ .. పూరి.. కమ్ముల లాంటి వాళ్లు మాత్రమేనా? అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తన ప్రతి సినిమాలో యాసకు ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు. స్వతహాగానే రచయితగా ఆయనకంటూ ఓ మార్క్ ఉంది. భాష- యాస-సంస్కృతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఆయన కామిక్ టైమింగుకి తగ్గట్టు యాసను ప్రయోగిస్తారు. ఈసారి త్రివిక్రమ్ శ్రీకాకుళం యాసతో ప్రయోగాత్మక పాత్రను తెరపైకి తెస్తున్నారు. తమిళనటుడు సముదిరకని `అల వైకుంఠపురములో` చిత్రంలో శ్రీకాకుళం యాసను మాట్లాడతారని సమాచారం. అతడి పాత్రలో నెగెటివ్ షేడ్ ఉంటుంది. ఇప్పటికే రిలీజైన రాములో రాముల సాంగ్ లో నైజాం యాసను ప్రయోగించాడు త్రివిక్రమ్. ఇంతకుముందు అత్తారింటికి దారేది- సన్నాఫ్ సత్యమూర్తి- జులాయి- జల్సా లాంటి చిత్రాల్లోనూ యాసను ఉపయోగించారు. పదాల్లో సందర్భాన్ని బట్టి విరుపును ప్రయోగించడంలో త్రివిక్రమ్ ఘనాపాటి. కామెడీ సీన్ అయినా.. యాక్షన్ మోడ్ లో సీరియస్ నెస్ ఉన్న సీన్ అయినా.. ఆర్టిస్టులతో చెప్పించిన విధానం పెద్ద సక్సెసైంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని మూలలా దిగి ఉన్న యాసను మన దర్శకులు ప్రయోగిస్తున్నారు. దర్శకులే రచయితలుగా రాణించేవాళ్లకు భాష-యాసపై పట్టు ఎక్కువ. అందుకే పై ఐదారుగురు దర్శకులు పెద్ద సక్సెసయ్యారు. వీళ్లలో త్రివిక్రమ్ ప్రతి సందర్భంలోనూ విజయవంతంగా ప్రయోగిస్తున్నారనే చెప్పాలి. నవతరంలో మారుతి.. సాయికిరణ్ అడివి వంటి దర్శకులు యాసను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. పలువురు దర్శకులు శ్రీకాకుళం యాసను ప్రయోగించి పెద్ద సక్సెసయ్యారు. నైజాం యాస.. శీకాకుళం యాస ప్రయోగించి కొందరు విమర్శల్ని ఎదుర్కొన్న సందర్భాలున్నాయి.
Please Read Disclaimer