వింత ఐడియాలతో సినిమాలను ముంచుకుంటున్నారే!

0

పాత రోత కొత్త వింత. అందుకేనేమో పబ్లిసిటీ టెక్నిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అప్పట్లో గోడకు మైదా పోసి వాల్ పోస్టర్లు అంటించేవారు. అదే పెద్ద పబ్లిసిటీ. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ గోడలకు పోస్టర్లు అంటిస్తే జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఎప్పటినుంచో ఉన్న ప్రింట్ మీడియా ప్రమోషన్ ఇప్పటికీ కొనసాగుతోంది కానీ సోషల్ మీడియా ప్రమోషన్స్.. టీవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే వీటితో పాటుగా సినిమాకు ప్రచారం కల్పించేందుకు ‘అంతకు మించి’ అన్నట్టుగా ఐడియాలతో తెలుగు ఫిలిం మేకర్లు వస్తున్నారు.

అయితే ఇలాంటి కొత్త రకం ప్రమోషన్స్ వల్ల ఎంత లాభం కలుగుతుందనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఏదో ఫ్లోలో’ మిలియన్ డాలర్ ప్రశ్న’ అని వచ్చేసింది.. అదేంటోనని అనుకోవద్దు. తెలుగులో భేతాళ ప్రశ్న అని రఫ్ గా అనువాదం చేసుకోవచ్చు లెండి. ఈమధ్య ఒక సినిమా విడుదల రోజు తొలి ఆట ఉచితం అన్నారు. ఫ్రీగా వస్తే ఫినాయిలు కూడా తాగే జనాలకు మన సమాజంలో కొదవ లేదు కాబట్టి బాగానే ఎగబడినట్టు ఉన్నారు. కానీ రెండవ ఆట నుంచి పరిస్థితి తిరగబడిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఈ ఐడియా ఎంతవరకూ పని చేసింది అని ప్రశ్నించుకుంటే.. కొంతవరకూ పనిచేసింది. అసలు సినిమా రిలీజ్ అవుతుందని ఎవరికీ తెలియకుండా రిలీజ్ కావడం కంటే ఇది వెయ్యి రెట్లు మేలు. కనీసం ఇలాంటిది ఒక సినిమా రిలీజ్ అవుతుందని చాలామందికి తెలిసింది.. సినిమాలో కనుక నిజంగా సత్తా ఉంటే పికప్ కూడా అయ్యేదేమో ఎవరికి తెలుసు?

ఇదో కొత్త తరం ఐడియా అనుకుంటే.. రీసెంట్ గా ‘మథనం’ టీమ్ వారు మరో కొత్త ఐడియాతో ముందుకువచ్చారు. తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చెయ్యకుండా అమెరికాలో మాత్రమే విడుదల చేస్తారట. అమెరికాలో ఈమధ్య లాభాలు తీసుకొచ్చిన తెలుగు సినిమా ఒక్కటీ లేదు. కొందరు స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఖర్చులు కూడా రావడం లేదు. చిన్న సినిమాల కోసం అమెరికా ప్రేక్షకులు థియేటర్లకు పోవడం లేదు. దీంతో కలెక్షన్స్ లేక అమెరికా డిస్ట్రిబ్యూటర్లు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ సినిమాను అమెరికాలో మాత్రమే రిలీజ్ చెయ్యడం అంటే ఇదో జోక్ మాత్రమే అని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి విచిత్రమైన ఐడియాలతో తమ సినిమాను మేకర్లే దెబ్బతీసుకుంటున్నారని ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Please Read Disclaimer