పారితోషికం లేని హీరోలు

0

టాలీవుడ్ లో పారితోషికం లేని హీరోలున్నారా?.. కాయ కష్టానికి ముడుపులు చెల్లించకపోతే ఎలా? అంటారా? అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది తప్పదు. వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడ్డాయా? ఆ హీరోల్ని పలకరించే దర్శకనిర్మాతలు ఎవరుంటారు? అలా ఎవరూ ఉండరన్నది జగమెరిగిన సత్యం. ఒక వేళ పలకరించి అవకాశం ఇచ్చారంటే పారితోషికం మాట సినిమా ఫలితాన్ని బట్టే వుంటుంది. సినిమా పోయిందా? రెమ్యునరేషన్ గోవిందా!.. మరి అలా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న హీరోలు ఇప్పుడు ఎవరున్నారు! అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. మాస్ మహారాజా రవితే- ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ సహా కుర్ర హీరోలు రాజ్ తరుణ్- తనీష్- వరుణ్ సందేశ్.. లాంటి హీరోలు ఈ కేటగిరీకే చెందుతారని విశ్లేషిస్తున్నారు. వీళ్లంతా హిట్లు లేక చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కోవడంతో ఈ సన్నివేశం నెలకొందట.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అతడు పారితోషికం ముందే తీసుకోవడం లేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా అందుతుందట. అంటే ముందే ఏదీ ఇవ్వలేమని నిర్మాతలు అంగీకారం కుదుర్చుకుంటున్నారన్నమాట. అలాగే ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ కెరీర్ ఇటీవల ఫ్లాపులతో ఇబ్బందికరంగానే మారింది. దీంతో తదుపరి సంపత్ నందితో సినిమాకి పారితోషికం లేకుండానే నటిస్తున్నాడట. లాభాల్లో వాటాలు మాత్రం ఉంటాయి. ఇకపోతే ఈ ఇద్దరూ పెద్ద స్థాయి హీరోలు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు కాబట్టి డిజిటల్ – శాటిలైట్ రైట్స్ లో నిర్మాతలకు కలిసొస్తుంది.

ఇక కుర్ర హీరోల్లో రాజ్ తరుణ్- వరుణ్ సందేశ్- తనీష్ లకు హిట్టనే మాట విని చాలా కాలమే అవుతోంది. అలాగే వరుణ్ సందేశ్ కెరీర్ `కుర్రాడు` తరవాత వచ్చిన `మరో చరిత్ర`తో గాడి తప్పింది. అక్కడి నుంచి వరుస ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నాడు. హీరోగా మార్కెట్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆ తరువాత అతనికి సినిమా ఇచ్చే నిర్మాతే కరువయ్యాడంటే అతని పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా చేయాలంటే పారితోషికం వదులుకోవాల్సిన పరిస్థితి. హిట్ అయితేనే పారితోషికం లేదంటే ఫ్రీగా చేసినట్టే. తనీష్దీ అదే పరిస్థితి. కృష్ణవంశీ `నక్షత్రం`తో తనీష్ కెరీర్ గాడితప్పింది. ఆ తరువాత `రంగు`తో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఇప్పుడు సినిమా చేయాలంటే పారితోషికం సక్సెస్ మాట విన్న తరువాత అడగాల్సిన పరిస్థితి. ఇక వీరితో పోలిస్తే రాజ్ తరుణ్ పరిస్థితి కొంత మెరుగు. అతనితో సినిమా తీసేవాళ్లున్నారు. కానీ పారితోషికం మాత్రం తరువాత తీసుకోవాల్సిందే. `కిట్టు వున్నాడు జాగ్రత్త` తరువాత రాజ్ తరుణ్ హిట్టు మాట విని దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం రాజ్తరుణ్ కి దిల్ రాజు సాయం అందిస్తున్నారు. రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం `ఇద్దరి లోకం ఒకటే` హిట్ అయితేనే కెరీర్ గాడిన పడేందుకు ఛాన్సుంటుంది. ఇక నిఖిల్ సిద్ధార్థ్ పరిస్థితి వేరొక రకంగా ఉంది. అతడి క్రేజీ గా వెలిగిపోతున్న టైమ్ లో అర్జున్ సురవరం రూపంలో క్రైసిస్ ని ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలోనే అతడు నిర్మాతలకు అనుగుణంగా తదుపరి చిత్రాల్ని అంగీకరించాల్సి వస్తోంది. అయితే ఒక్క బ్లాక్ బస్టర్ అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఆ తర్వాత తిరిగి పట్టాలెక్కేస్తారు ఎవరైనా! మరి ఆ ఒక్క బ్లాక్ బస్టర్ ఎలా అన్నదే ఇంపార్టెంట్ ఇప్పుడు?.
Please Read Disclaimer