చెన్నై ‘సత్యం’ లో టాలీవుడ్ మీడియా

0

సూపర్ స్టార్ రజనీకాంత్ కథనాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మించిన `2.ఓ` నవంబర్ 29న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇండియా – సింగపూర్ – జపాన్ – థాయ్ ల్యాండ్ – న్యూజిలాండ్ – చైనా – అమెరికా – బ్రిటన్ – సౌదీ అరేబియా – యుఏఈ – రష్యాలో సైమల్టేనియస్ గా ఈ చిత్రం రిలీజవుతోందని లైకా సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని లాంచ్ చేసింది.

నేటి మధ్యాహ్నం 12 గంటలకు అభిమానుల ఉత్కంఠ నడుమ 2.ఓ ట్రైలర్ రిలీజవుతోంది. ఈ ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది రజనీ- శంకర్- అక్షయ్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.ఈ ట్రైలర్ ఇప్పటివరకూ యూట్యూబ్ లో ఉన్న అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. 2.ఓ ట్రైలర్ ని చెన్నయ్లోని సత్యం థియేటర్ లో 3డి వెర్షన్ లో చూపిస్తుండడం విశేషం. ఈ ఈవెంట్ ని అటు చెన్నయ్ మీడియాతో పాటు – ఇటు టాలీవుడ్ మీడియా లైవ్ లో కవర్ చేస్తుండడం విశేషం.

టాలీవుడ్ నుంచి పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధుల్ని విమాన మార్గం ద్వారా చెన్నయ్ కి తీసుకెళ్లారు. టాలీవుడ్ ప్రఖ్యాత పీఆర్ వో – సూపర్హిట్ అధినేత బీఏ.రాజు తెలుగు మీడియాని చెన్నయ్ ఈవెంట్ కి తీసుకుని వెళ్లారు. అన్ని ప్రధాన మీడియాల నుంచి ప్రతినిధుల్ని విమానం టిక్కెట్లు బుక్ చేసి మరీ తీసుకెళ్లడం పరిశ్రమలో చర్చకొచ్చింది. అయితే ఇప్పుడే కాదు.. ఇదివరకూ `రోబో` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి తెలుగు మీడియాని అప్పట్లో తీసుకెళ్లారు. అయితే టాలీవుడ్ మీడియాలో దాదాపు 150 మంది జర్నలిస్టులు ఉండగా – ఇంతమందిలో కొందరినే ఎంపిక చేసి తీసుకెళ్లడం మీడియా వర్గాల్లో చర్చకు తావిచ్చింది. ప్రస్తుత ఈవెంట్ కి వెళ్లిన తెలుగు మీడియా రాను పోను విమానం టిక్కెట్లు సహా – అక్కడ బస ఏర్పాట్లు అన్నిటికీ లైకా సంస్థ భారీ మొత్తమే ఖర్చు చేస్తోందిట. రోబో (ఎంథీరన్) ట్రైలర్ రిలీజ్ సమయంలో సన్ పిక్చర్స్ సంస్థ ఇలానే ఖర్చుకు వెనకాడకుండా ఇరుగుపొరుగు పరిశ్రమల నుంచి ప్రధాన మీడియా ప్రముఖుల్ని ఆహ్వానించింది.
Please Read Disclaimer