స్ట్రీమింగ్ రైట్స్ అమ్మండి.. సీక్రెట్ గా ఉంచండి!!

0

ఇంటర్వ్యూలో ఎవరినైనా సెలబ్రిటీలను “మీ మైనస్ పాయింట్లు ఏవైనా చెప్పండి?” అని అడిగితే సమాధానం చెప్పేందుకు తటపటాయిస్తారు. కొంతమంది దాటవేస్తారు. కొందరు ఏదో ఒక సమాధానం చెప్పి నెక్స్ట్ ప్రశ్నకు వెళ్లిపోతారు. మైనస్ పాయింట్ చెప్పమంటేనే ఇలా కిందా మీదా అయిపోతే.. తమ సినిమా బిజినెస్ కు నష్టం కలిగే అవకాశం ఉన్న విషయాన్ని ఏ ఫిలిం మేకర్ అయినా.. ఎక్కడైనా చెప్పుకుంటారా? చెప్పుకోరు. ఇప్పుడు టాలీవుడ్ లో అమెజాన్ కు స్ట్రీమింగ్ రైట్స్ అమ్మే విషయం అలానే ఉందట.

ఒక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చాలా హంగామా జరుగుతుంది. కొంతమంది మేకర్లు ఆ బిజినెస్ ను ఎక్కువ చేసి మరీ చెప్పుకుంటారు. నైజామ్ రైట్స్ ఇంత అని.. సీడెడ్ రైట్స్ అంత అని.. ఓవర్ సీస్ రైట్స్ ఆకాశాన్ని టచ్ చేశాయని.. శాటిలైట్ రైట్స్ ధర శాటిలైట్ దాకా వెళ్లిపోయిందని ప్రచారం చేసుకుంటారు. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ గురించి చెప్పుకోవడం అయితే చాలా గొప్ప.. ఎందుకంటే మన హీరోలకు నార్త్ ఆడియన్స్ లో ఉండే గుర్తింపుకు అది కొలమానం లాంటిది. అయితే ఇవన్నీ గర్వంగా పబ్లిసిటీ చేసుకుంటున్న మన టాలీవుడ్ మేకర్లు స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ కు అమ్ముడుపోయిన విషయాన్ని మాత్రం ప్రచారం చేసుకునేందుకు ఇష్టపడడం లేదట. అమెజాన్ కు రైట్స్ అమ్మిన విషయాన్ని వీలైనంత వరకూ దాచిపెడుతున్నారట.

కారణం అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన యాభై రోజులకు అమెజాన్ లోకి వచ్చేస్తుంది అని ముందే చెప్పేస్తే.. థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల్లో కొంతమంది రాకుండా ఆగిపోతారేమోనని భయపడుతున్నారట. తద్వారా కలెక్షన్స్ కు గండిపడే అవకాశం ఉంటుంది కదా. యాభై రోజులంటే ఎంత చెప్పండి.. కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోతాయి. అ కొద్ది రోజులు ఓపిక పడితే అమెజాన్ లో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు హెచ్ డీ క్వాలిటీ తో చూడవచ్చు. పైగా కూల్ డ్రింకుకు రూ. 100 పాప్ కార్న్ కు మరో వంద ఖర్చు పెట్టాల్సిన పని అంతకన్నా లేదు. అందుకే ఈమధ్య కాలంలో చాలామంది నిర్మాతలు అమెజాన్ కు మంచి ధరకు స్ట్రీమింగ్ రైట్స్ అమ్మినప్పటికీ.. ఆ డీల్ ఎంతకు కుదిరిందనే అప్డేట్స్ బయటకు రానివ్వడం లేదట. అంటే సినిమాను మంచి రేటుకు అమెజాన్ కు అమ్ముకుంటారు.. ఆ డబ్బు బ్యాంకులో వేసుకుంటారు కానీ ఇన్ఫో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతారు. బైటకు చెప్పుకోరన్నమాట!
Please Read Disclaimer