ఆ మ్యూజిక్ డైరెక్టర్ వేరియేషన్ చూపించగలడా…?

0

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు ఎస్.ఎస్. తమన్. ఇక టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కంపోజర్ గా దుమ్ము రేపుతున్నాడు. ‘కిక్’ సినిమాతో సంగీత ప్రపంచంలో కొత్త సౌండింగ్ కి నాంధి పలికిన తమన్ అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తమన్ పాటల్లో డప్పుల మోత తప్ప సాహిత్యం వినపడదు అని కామెంట్స్ వినపడేవి. ఇప్పుడు తన పాటలతో వారి చేత కూడా శభాష్ అనిపించుకుంటున్నాడు. సాంగ్స్ తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి తమన్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంలో మేజర్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక రిలీజ్ కి రెడీ అయిన నాని – సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. అలానే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రానున్న ‘మిస్ ఇండియా’ మూవీకి కూడా సంగీతం సమకూర్చారు. ఇదే ఊపులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు. వీటితో పాటు సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’.. రవితేజ ‘క్రాక్’ చిత్రాలకి కూడా సంగీతం అందించాడు తమన్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమాలకు రీ రికార్డింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు థమన్. అంతేకాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యాడు. వాటిలో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమా.. నాని ‘టక్ జగదేశ్’.. వరుణ్ తేజ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఇదిలా ఉండగా లేటెస్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’కి కూడా తమన్ పాటలు అందించనున్నాడని అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందనున్న సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందించే అవకాశాలున్నాయి. వీటితో పాటు మరికొన్ని తెలుగు తమిళ్ సినిమాలు లైన్లో పెట్టే పనిలో ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ సమయాన్ని తమన్ తాను కమిట్ అయిన సినిమాలకు ట్యూన్స్ రెడీ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. దాదాపు డజను సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ ఆ సినిమాలకి వేరియేషన్ ఏ మాత్రం చూపిస్తాడో చూడాలి. మొత్తం మీద మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ప్రస్తుతం తన కెరీర్లోనే పీక్ ఫార్మ్ లో ఉన్నాడని చెప్పవచ్చు.
Please Read Disclaimer