నిర్మాతలు గా మారి చేతులు కాల్చుకుంటున్న యువ హీరోలు

0

సినిమాల నిర్మాణం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే 15% శాతం కూడా విజయాలు లేని పరిశ్రమలో డబ్బు పెట్టుబడి పెట్టడం.. దానిపై లాభాలు సంపాదించుకోవడం సాధారణమైన విషయం కాదు. నిర్మాణం లో తలలు పండిన నిర్మాతలే ఒక్కోసారి దెబ్బ తింటుంటారు. చాలామంది సీనియర్ నిర్మాతలు మారిన ట్రెండ్ ను అర్థం చేసుకోలేక.. ఆడియన్స్ పల్స్ పట్టుకోలేక తెరమరుగైపోయారు. ఇలాంటి నిర్మాణంలోకి యువహీరోలు కూడా అడుగుపెడుతూ ఉన్నారు. అయితే ఈ హీరోలలో దాదాపుగా అందరికీ నిర్మాణం చేదు ఫలితాలనే ఇచ్చింది.

నాగ శౌర్య ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ‘ఛలో’ సినిమా ను నిర్మించాడు. ‘చలో’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత రెండో ప్రయత్నంగా నిర్మించిన ‘నర్తనశాల’ తీవ్రంగా నష్టాలు మిగిల్చింది. ఇక ఐరా బ్యానర్లో తెరకెక్కిన మూడో సినిమా ‘అశ్వథ్థామ’ ఈమధ్యే రిలీజ్ అయింది. ఈ సినిమా పరిస్థితి ఆశాజనకంగా లేదు. సినిమాకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల మాట.

నితిన్ విషయమే తీసుకుంటే మొత్తం మూడు సినిమాలను నిర్మించాడు. మొదటి సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఓకె అనిపించుకుంది. అయితే ‘చిన్నదాన నీకోసం’ ఫ్లాప్ గా నిలిచింది. ‘అఖిల్’ మాత్రం నితిన్ కు తీవ్ర నష్టాలు మిగిల్చింది. ‘అఖిల్’ దెబ్బకు నితిన్ ఇప్పటివరకూ నిర్మాణం జోలికి పోలేదు.

విజయ్ దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాతగా మారాడు. అతి తక్కువ బడ్జెట్లో నిర్మించినప్పటికీ ఈ సినిమాకు నష్టం తప్పలేదని టాక్ ఉంది. ఈ సినిమా క్వాలిటీ తక్కువగా ఉండడం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

న్యాచురల్ స్టార్ నాని మొదటిసారి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ‘అ!’ సినిమాను నిర్మించగా మంచి ప్రశంసలు దక్కాయి కానీ పెట్టుబడి మాత్రం వెనక్కు రాలేదనే టాక్ ఉంది.

మరో హీరో సందీప్ కిషన్ వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా సందీప్ కు స్వల్పంగా నష్టాలు తీసుకొచ్చిందని సమాచారం.

మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పది సినిమాలు నిర్మించగా వాటిలో ‘దేనికైనా రెడీ’.. ‘దూసుకెళ్తా’ మాత్రం విజయం సాధించాయి. మిగతా సినిమాలన్నీ దాదాపుగా నిరాశపరిచాయి.

‘నువ్విలా’.. ‘జీనియస్’ లాంటి సినిమాలో హీరోగా నటించిన హవీష్ కూడా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ‘సెవెన్’ సినిమాను నిర్మించి భారీ నష్టాలను మూట కట్టుకున్నాడు.
Please Read Disclaimer