పవన్ ని అట్నుంచి నరుక్కొస్తున్నారా?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ తిరిగి సినీఆరంగేట్రం చేస్తున్నారంటూ గత కొంతకాలంగా మీడియాలో హోరెత్తిపోతోంది. ఆయన రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రాను! అని చెప్పినా తెరవెనక ఇంకేదో జరుగుతోంది అంటూ కథనాలు వండి వారుస్తున్నారు.

కొందరైతే పవన్ కోసం క్రిష్ ఓ జానపద కథను రెడీ చేశాడని అందులో నటించే అవకాశం ఉందని ప్రచారం చేశారు. మరోవైపు పింక్ రీమేక్ లో నటించేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నారని అయితే తనకు సౌకర్యంగా ఉండే దర్శకుడితో మాత్రమే చేస్తానని అన్నారని ప్రచారమవుతోంది. అంతేకాదు పింక్ రీమేక్ కోసం పవన్ కేవలం ముప్పయ్ రోజుల కాల్షీట్లు కేటాయిస్తే సరిపోతుంది. రాజకీయాల్లో కొనసాగుతూనే కేవలం నాలుగు వారాల సమయాన్ని ఇటు కేటాయించేందుకు ఆయన సుముఖంగా ఉంటే చాలు. సినిమా పూర్తవుతుంది అంటూ మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

అయితే ఇది సాధ్యమవుతుందా? అంటే అందుకు ఛాన్సుందని అంటున్నారు. ఇప్పటికే అగ్రనిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కి తన స్నేహితుడు త్రివిక్రమ్ తో అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే దర్శకుడి వైపు నుంచి నరుక్కు రావాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ప్రయత్నాలు సఫలమవుతాయా? ఇందులో నిజం ఎంత? అన్నది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.
Please Read Disclaimer