రాజు.. బానిస.. ఇలా పోల్చటం త్రివిక్రమ్ కే సాధ్యం

0

మాటల మాంత్రికుడి నోటి నుంచి వచ్చే మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన అల వైకుంఠపురంలో మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ కావటమే కాదు.. ఈ సినిమాలో సామజవరగమన.. పాట ఎంతలా తెలుగు ప్రజలకు పట్టేసిందో ఎవరి ఫోన్ కు రింగ్ చేసినా.. వినిపించే ఆ పాట చెప్పేస్తుంది.

మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలా ఉంటుందన్న చర్చ భారీగా సాగుతోంది. ఇదే ప్రశ్నను త్రివిక్రమ్ కు సంధిస్తే? సరిగ్గా అదే ప్రయత్నం చేసిన మీడియాకు తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో.. కంప్లీట్ ఫీలింగ్ తో బయటకొస్తారని చెప్పుకొచ్చారు. చీర నేసినోడికి దాని అందం ఎలా తెలీదని.. ఒక అనుభూతితో నేసుకుంటూ వెళ్లిపోతారన్నారు.

తాను కూడా అంతేనని.. అలాంటి తీరులోనే సినిమా చేసుకుపోయినట్లు చెప్పుకొచ్చారు. తన సినిమా ఎలా ఉందన్నది ప్రేక్షకులే చెప్పాలన్న ఆయన.. కథ రాసేంతవరకే రచయిత దానికి రాజు.. తర్వాత ఆ కథకు అతను బానిస అని చెప్పుకొచ్చారు. తానెంత ఎత్తుకు ఎదగాలని ఏ దర్శకుడు అనుకొని చేయడని.. తన పని తాను చేసుకుంటూ పోతాడన్నాడు.

ఇక.. త్రివిక్రమ్ అన్నంతనే గుర్తుకొచ్చే డైలాగ్స్ మీద కసరత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పాడు. నిజంగా తాను డైలాగ్స్ గురించి ఆలోచించనని.. స్పాంటేనియస్ గా రచయతగా తనను తాను చూసుకుంటానని.. తాను రాసేందుకు ఎక్కడికో వెళ్లనన్నాడు. ఇంట్లోనే కూర్చొని రాసేసుకుంటూ ఉంటానంటూ సీక్రెట్ రివీల్ చేశాడు. చాలా తేలిగ్గా.. ప్రశాంతంగా పని చేయటానికి ఇష్టపడతానని తన వర్క్ స్టైల్ గురించి చెప్పుకొచ్చాడు.
Please Read Disclaimer