సెంటిమెంట్లు ఉన్నాయి కానీ.. ‘అ’ సెంటిమెంట్ లేదట

0

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటలతో మేజిక్ చేసే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆ మాటకు వస్తే.. ఆయన పుణ్యమా అని.. తెలుగు సినిమాల్లో సినిమాల్లో డైలాగుల అర్థం మారిపోయిందని చెప్పక తప్పదు. చిన్న చిన్న మాటలే కానీ.. అంతులేని లోతుల్ని టచ్ చేసేలాంటి మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. త్రివిక్రమ్ ను స్ఫూర్తిగా తీసుకొని.. మాటలతో సమ్మోహన పరిచేలా రాసేందుకు కిందామీదా పడిపోయేవారెందరో.

తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం అల వైకంఠపురంలో.. బన్నీతో చేసిన ఈ సినిమా మరో రోజులో విడుదల కానుంది. పందొమ్మిదేళ్లలో కేవలం పదకొండు సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్.. అతడు చిత్రంతో ‘అ’ పేరుతో టైటిల్ పెట్టటం షురూ చేశారు. 2013లో ఆయన దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఎంతటి బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తీసిన సన్నాప్ సత్యమూర్తి మినహా.. తర్వాత తీసిన అన్ని సినిమాలకు ‘అ’తోనే టైటిల్ ఫిక్స్ చేయటం విశేషం.

2015లో తీసిన అ అ.. 2018లో అజ్ఞాతవాసి.. గత ఏడాది విడుదలైన అరవింద సమేత వీర రాఘవ.. తాజాగా అల వైకుంఠపురంలో ఇలా.. తన ప్రతి సినిమాకు ‘అ’తో టైటిల్ ఉండటం ఆసక్తికరంగా మారింది. ‘అ’ అక్షరంతో స్టార్ట్ అయ్యే సినిమాలు ఆయనకు హిట్.. ప్లాప్ లు రెండు ఇచ్చాయి. కానీ.. అ మీద ఆయనకున్న ఆసక్తి ఏమిటన్న దానిపై క్లారిటీ ఇచ్చింది లేదు.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రశ్నించారు. మీ సినిమా పేర్లు అన్ని ‘అ’తోనే మొదలవుతున్నాయి ఎందుకని? అన్న ప్రశ్నకు త్రివిక్రమ్ ఆసక్తికరంగా బదులిచ్చారు. తనకు సెంటిమెంట్లు ఉన్నాయన్న ఆయన.. ‘అ’తోనే సినిమా పేరు పెట్టాలన్న సెంటిమెంట్ ఏమీ లేదని.. అలా కుదిరిపోతుందని వ్యాఖ్యానించారు. అనుకోకుండా అలా కుదిరిపోతుందే తప్పించి.. ప్రత్యేకమైన కారణం ఏమీ లేదన్నారు. ఏమీ లేకున్నా.. వరుస పెట్టి నాలుగు సినిమాలకు ‘అ’ అక్షరంతోనే టైటిల్ పెట్టేయటం విశేషం.
Please Read Disclaimer