లాక్డౌన్ కష్టాలు: కారు అమ్ముకున్న నటుడు

0

మహమ్మారి వైరస్ విస్తరించి లాక్ డౌన్ తో దేశమే బందీ అయిపోయింది. సర్వం బంద్ అయ్యింది. ఉద్యోగ ఉపాది కోల్పోయారు. సినీ పరిశ్రమపై ఇంకా చాలా పెద్ద దెబ్బ పడింది. ఇప్పట్లో థియేటర్స్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందరి జీవితాల్లో పెను ఆర్థిక విధ్వంసం చోటుచేసుకుంది. కోట్ల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సాధారణ పేదల కుటుంబాల్లోనే కాదు ఈ కష్టాలు సెలెబ్రెటీలను కూడా వెంటాడుతున్నాయి.

నిన్న హిందీలో ఫేమస్ యాంకర్ హోస్ట్ అయిన యువతి షూటింగ్ లు ప్రారంభం కాక డబ్బుల్లేక ఇండోర్ లో ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంది. ఆ ఘటన మరిచిపోకముందే బాలీవుడ్ బుల్లితెర నటుడు మానస్ షా డబ్బుల కోసం తన కారును అమ్ముకున్న ధైన్యం సినీ ఇండస్ట్రీ పరిస్థితిని కళ్లకు కట్టింది. షూటింగ్ లకు బ్రేక్ పడడంతో ఆదాయం లేక ఇలా నటుడు తన కారు అమ్మేసుకున్నాడు. వాటితో పొట్టపోసుకుంటున్నాడు.

మానస్ షా ‘హమారి బహు సిల్క్’ అనే టీవీ షో చేస్తూ పాపులర్ అయ్యాడు. ‘హమారీ దేవ్రాణి’ ‘సంకత్మోచన్ మహాబలి హనుమాన్’ వంటి షోలు చేస్తున్నాడు. దానికి సంబంధించిన డబ్బులు కూడా అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వాపోయాడు. అంతేకాదు.. అద్దెకుంటున్న ఇంటిని వదిలి లోఖండ్ వాలాలో ఉన్న బంధువుల ఇంటికి మారాను అని తన బాధను మానస్ షా వ్యక్తం చేశాడు.

తన జీవితంలో ఇంతటి దుర్భర పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదని.. అందుకే కారును అమ్మేసుకున్నానని నటుడు మానస్ షా తెలిపాడు. లాక్ డౌన్ తో అందరి పరిస్థితి దయనీయంగానే మారిందని.. నాకు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరి పరిస్థితి ఇలానే ఉందని.. మాకు గత చెల్లింపులు చేయలేదని వాపోయాడు. సంవత్సరం పాటు షూటింగ్ చేసినా డబ్బులు సరిగా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం పనిలేక.. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియడం లేదని భావోద్వేగానికి గురయ్యాడు.
Please Read Disclaimer