32 రోజులు – 2 అగ్ని పరీక్షలు

0

టాలీవుడ్ గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని అతి పెద్ద విజువల్ ఫీస్ట్ కు రెడీ అవుతోంది. అది కూడా ముప్పై రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు అంటే మాటలా. ఆగస్ట్ 30న రిలీజవుతున్న సాహోకు అక్టోబర్ 2 రానున్న సైరాకు మధ్య ఉన్న గ్యాప్ అదే. అన్ని హక్కులతో కలిపి ప్రాధమిక దశలోనే సుమారుగా 500 కోట్లకు పైగా బిజినెస్ వీటి మీద జరుగుతోందని ట్రేడ్ మాట. అందులోనూ రెండు సినిమాలూ మల్టీ లాంగ్వేజెస్ లో వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది స్క్రీన్లను బుక్ చేసుకుంటున్నాయి.

ముందుగా వస్తున్న సాహో మీదే ప్రస్తుతానికి అందరి కన్ను ఉంది. రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఇప్పటిదాకా భారతీయ తెరచూడని అతి పెద్ద యాక్షన్ వండర్ గా దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల తెరలలో విడుదలవుతుందో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. ఇక సాహో వచ్చిన 32 రోజులకు సైరా వస్తాడు. రెండేళ్ల గ్యాప్ తో ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి మొదటిసారి చేసిన స్వాతంత్ర సమరయోధుడి కథ కావడంతో అంచనాలు మాములుగా లేవు. ఇదీ సాహోకు ధీటుగా ఇంచుమించు అంతే బడ్జెట్ తో రూపొందిన మూవీ.

సాహోలో భారం మొత్తం ప్రభాస్ భుజాల మీదే ఉండగా సైరాలో అమితాబ్ సుదీప్ విజయ్ సేతుపతి లాంటి స్టార్ల సపోర్ట్ చిరుకు అదనపు బలంగా నిలుస్తోంది. ఇప్పుడీ రెండు సినిమాలు అంచనాలు అందుకుని బ్లాక్ బస్టర్ అయితే కనక తెలుగు సినిమా విజయ పతాక ప్రపంచ వీధుల్లో మరింత గర్వంగా ఎగరడం ఖాయం. టాలీవుడ్ స్టాండర్డ్ గురించి నలువైపులా చర్చలు జరగడం కూడా గ్యారెంటీ. అందుకే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు తాము గతంలో ఇంత తక్కువ టైంలో రెండు భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ మీద లైఫ్ టైం ఇన్వెస్ట్ మెంట్ చేయలేదని ఇదే మొదటిసారని చెప్పడం బట్టి చూస్తే హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది
Please Read Disclaimer