ఇస్మార్ట్ లో ఇద్దరు.. రెడ్ లో ముగ్గురా?

0

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి సక్సెస్ ను దక్కించుకున్న రామ్ జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఈయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన నేను శైలజ మరియు ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వీరి కాంబోలో హ్యాట్రిక్ ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

సినిమా మరో నెల రోజుల్లో చిత్రీకరణ పూర్తి అవ్వబోతుందనే సమాచారం అందుతోంది. ఈ సమయంలో మరో హీరోయిన్ గా తమిళ హీరోయిన్ అమృత అయ్యర్ ను యూనిట్ సభ్యులు పరిచయం చేశారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘బిగిల్’ చిత్రంలో నటించి మెప్పించిన అమృత అయ్యర్ ను తెలుగుకు ఈ చిత్రంతో పరిచయం చేయబోతున్నారు. ఇటీవలే రెడ్ చిత్రంలో అమృత అయ్యర్ అంటూ ఒక పోస్టర్ ను కూడా యూనిట్ సభ్యులు రిలీజ్ చేశారు.

‘రెడ్’ చిత్రంలో అమృత అయ్యర్ కు ముందే నివేదా పేతురాజ్ మరియు మాళవిక శర్మ నటిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు. అంటే మొత్తం ఈ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారన్నమాట. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా నటేష్.. నిధి అగర్వాల్ లతో రొమాన్స్ చేసిన రామ్ ఈసారి రెడ్ చిత్రంలో ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ తో రెడీ అవుతున్నాడు. ఈమద్య కాలంలో ఒక సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. రామ్ మరి కథ అంతగా డిమాండ్ చేసిందేమో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Please Read Disclaimer