మరోసారి తెరపైకి ఉదయ్ కిరణ్ బయోపిక్

0

బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా.. జయాపజయాలతో సంబంధం లేకుండా బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగులో ఈమధ్య ఈ బయోపిక్ ల ట్రెండ్ లో కొత్త అంశం ఏంటంటే.. బయోపిక్కే తీసి.. దానికి బావర్చీ మసాలా దట్టిస్తారు.. ఆ సినిమాను బయోపిక్ కాదు.. కల్పితం అని ఫైనల్ గా చెప్తారు. జనాలేమో ఆ సినిమాను భయోపిక్ అని కామెడీ చేస్తుంటారు. సరే ఈ కామెడీల నుంచి ఎంత పెద్ద స్టార్ అయినా తప్పించుకోలేరు కాబట్టి వాటిని పట్టించుకోవలసిన పని లేకుండా ఫిలిం మేకర్లు బయోపిక్ ట్రెండ్ ను ఆ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు.

కొన్ని నెలల క్రితం టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటూ వార్తలు వచ్చాయి. సెట్స్ మీదకు వెళ్ళడం ఖాయం అని కూడా అన్నారు.. అంతలోనే తూచ్ అన్నారు. అయితే తాజాగా మరోసారి ఉదయ్ కిరణ్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఒక ఫిలిం మేకర్ ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారట. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతోందని.. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్రకు ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. వారిలో ఒకరు రాజ్ తరుణ్ కాగా మరొకరు సందీప్ కిషన్ అని అంటున్నారు. ఇంతకు మించి ఈ బయోపిక్ గురించి పెద్దగా వివరాలేమీ బయటకు రాలేదు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ రానుందని సమాచారం.

తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొని లవర్ బాయ్ ఇమేజ్ సాధించిన టాలీవుడ్ హీరోలలో ఉదయ కిరణ్ ది ప్రత్యేక స్థానం. ‘చిత్రం’ (2000) సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఉదయ్ కిరణ్.. ‘నువ్వు నేను’.. ‘మనసంతా నువ్వే’ సినిమాలతో అప్పట్లో ఒక్కసారిగా యూత్ కు ఫేవరెట్ హీరోగా మారాడు. తర్వాత కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. 2014 లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఉదయ్ అకాలమరణం అటు ఇండస్ట్రీ వర్గాలను.. ఇటు ప్రేక్షకులను కలచివేసింది. ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటే కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. మరి బయోపిక్ తలకెత్తుకునేవారు ఎంతమాత్రం నిజానిజాలను చూపిస్తారో వేచి చూడాలి..
Please Read Disclaimer