డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టబోతున్న స్టార్ ప్రొడ్యూసర్స్…?

0

డిజిటల్ ప్రపంచంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా చూపిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఇంకా ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా అందరూ వెబ్ సిరీస్ లని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుండటంతో స్టార్స్ అంతా ఇప్ప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతుందని భావిస్తున్న దర్శక నిర్మాతలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు సినిమాలకు మించిన బడ్జెట్లు పెట్టడానికి ఓటీటీ సంస్థలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే మన టాలీవుడ్ నుండి హీరో హీరోయిన్స్ డైరెక్టర్లు ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ వరల్డ్ లో అడుగు పెట్టారు. క్రిష్ నందిని రెడ్డి సంకల్ప్ రెడ్డి తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్లు వెబ్ సిరీస్ లలో అడుగుపెట్టారు. శరత్ మరార్ స్వప్న దత్ లాంటి బడా నిర్మాతలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సైతం వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచన చేస్తున్నారట. దీని కోసం ఇప్పటికే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరియు ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరితో రెండు భారీ వెబ్ సిరీస్ లు నిర్మించాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పూరీ జగన్నాథ్ లాంటి సీనియర్ డైరెక్టర్.. సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ ఓటిటి ప్లాట్ ఫార్మ్ లోకి ఎంటరైతే తెలుగులో వీటికి మరింత ఆదరణ మరియు ప్రచారం దక్కడం ఖాయమని చెప్పవచ్చు. సెన్సార్ ఉంటేనే రెచ్చిపోయే కంటెంట్ వెండితెరపై చూపించే పూరీ సెన్సార్ లేని వెబ్ వరల్డ్ లో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేయగలరో ఉహించుకోగలం. అయితే వీరిద్దరితో ఎవరితో ప్రాజెక్ట్స్ ఓకే అయినా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పూరీ విజయ్ దేవరకొండ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సుజీత్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు కూడా వెబ్ సిరీస్ లు నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారనేది వాస్తవం.
Please Read Disclaimer