సూపర్స్టార్ V సెంటిమెంట్!

0

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఏ. ఆర్ మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే స్టార్ హీరోల చేతుల మీదుగా దర్బార్ ప్రమోషన్ ని ప్రారంభించారు. తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా లాంచ్ చేయించి హీట్ పెంచాడు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురములో అనే రెండు చిత్రాలకు పోటీగా దర్బార్ బాక్సాఫీస్ బరిలోకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా రిలీజ్ అనంతరం సూపర్ స్టార్ ఓ తెలుగు దర్శకుడితో పని చేస్తున్న సంగతి తెలిసిందే. `విశ్వాసం ఫేం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. `వ్యూహం` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తమిళ్ లో వ్యూగం అనే టైటిల్ ఫిక్సయ్యిందట. ఈ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. టైటిల్ క్యాచీగా ఆసక్తికరంగా ఉందంటూ రజనీ అభిమానులు వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 5న ప్రారంభం కానుంది. అయితే శివ గతంలో చేసిన సినిమాలన్నీ టైటిల్ `వి`తో మొదలయ్యాయి. వీరం- వేదాళం- వివేగం- విశ్వాసం.. ఈ బాటలోనే తాజాగా వ్యూహం అని ఖరారు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీ టైటిల్ తో సినిమాలన్నీ తమిళంలో మంచి విజయం సాధించాయి. దీంతో వ్యూహంపైనా అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయిట. ఇందులో రజనీకి జోడీగా కీర్తి సురేష్- జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
Please Read Disclaimer