ఆర్జీవీ ‘హృదయ్ కిరణ్’ వార్తల్లో నిజమెంత…?

0

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటలు.. నిజ జీవిత పాత్రలు.. సంచలనం సృష్టించిన అంశాలను తీసుకొని సినిమాలుగా మలచడంలో దిట్ట అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ‘రక్తచరిత్ర’ ‘వంగవీటి’ ’26/11′ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘పవర్ స్టార్’ లాంటి సినిమాలు తెరకెక్కించేసాడు. ఇప్పుడు తాజాగా యావత్ భారతదేశానికి షాక్ ఇచ్చిన ఘటన ఆధారంగా రూపొందించిన సినిమా ”మర్డర్” అంటూ ట్రైలర్ రిలీజ్ చేసాడు. దీంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా ఘటన ఆధారంగా సినిమా తీయబోతున్నాని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తీయబోయే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ‘ఆ రోజు రాత్రి ఏమి జరిగింది?’ అనే సినిమా తీస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా వర్మ టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులోనూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చాలా బియోపిక్స్ తీసే ఆలోచన ఉందని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో ఆర్జీవీ ఉదయ్ కిరణ్ సూసైడ్ పై సినిమా తీస్తాడనే వార్తలు ఊపందుకున్నాయి.

ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించడం అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది. ఉదయ్ ఆత్మహత్య చేసుకోడానికి బంధుప్రీతి మరియు ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు కారణమని అందరూ చర్చించుకున్నారు. ఇప్పుడు వర్మ ఈ బయోపిక్ తీయడానికి అతన్ని ప్రేరేపించిన అంశాలు ఏమై ఉంటాయని సినీ జనాలు ఆలోచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆర్జీవీ ఇప్పటికే ఉదయ్ కిరణ్ బయోపిక్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అంతేకాకుండా ఈ చిత్రానికి ”హృదయ్ కిరణ్” అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. కరోనా డేస్ లో జెట్ స్పీడ్ లో సినిమాలు తీసేస్తున్న వర్మ ఈ సినిమాపై ఇంకా అనౌన్సమెంట్ ఇవ్వలేదు. మరి ‘హృదయ్ కిరణ్’ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.