క్రేజీ హీరోయిన్ గా మారుతున్న ‘జాను’ బ్యూటీ..!

0

తమిళ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ’96’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించింది. ఈ చిత్రం తెలుగులో ‘విజిల్’ పేరుతో డబ్ అవడంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఇదే క్రమంలో రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన ‘చూసి చూడంగానే’ అనే స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించింది వర్ష. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ వర్ష బొల్లమ్మ మంచి పేరే తెచ్చుకుంది. ఇక ’96’ తెలుగు రీమేక్ ‘జాను’ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో వర్ష బొల్లమ్మ తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ క్రమంలో వర్ష బొల్లమ్మ.. యువ హీరో రాజ్ తరుణ్ నటించే ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. సాంటో(మోహన్ వీరంకి) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ చిత్రం కోసం వర్ష బొల్లమ్మ సుమారు 40 లక్షలు తీసుకుంటోందని టాక్. అలానే రెండు తమిళ సినిమాలకు కూడా సైన్ చేసిందట. మీడియం రేంజ్ హీరోల సరసన నటించే కెపాసిటీ ఉన్న బ్యూటీగా పేరు తెచ్చుకున్న వర్ష.. నిత్యామీనన్ కి రీప్లేసెమెంట్ గా భావించవచ్చని కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి.