ప్రియురాలితో యంగ్ హీరో పెళ్లి

0

ఆ యంగ్ హీరోని సల్మాన్ వారసుడిగా భావిస్తుంది బాలీవుడ్. అతడంటే సల్మాన్ కి వల్లమాలిన అభిమానం. తన సినిమాల్ని రీమేక్ చేస్తానంటే ఆ యువహీరోకి ధారాదత్తం చేయడానికి భాయ్ సిద్ధం. నా వారసుడు అంటూ సల్మాన్ చాలానే సంబరపడిపోతుంటాడు. అయితే తన గురువు సల్మాన్ కి పూర్తి ఆపోజిట్ గా అతడి వ్యక్తిగత జీవితం ఉంటుంది. రియల్ లైఫ్ లో ఎందరో గాళ్ ఫ్రెండ్స్ ని మార్చి సీనియర్ బ్యాచిలర్ గా మిగిలిపోయిన సల్మాన్ బాటలో వెళ్లేందుకు మాత్రం ఆ కుర్ర హీరో అస్సలు ఇష్టపడలేదు. అంతేకాదు.. తొందర్లోనే తన గాళ్ ఫ్రెండ్ ని పెళ్లాడేస్తున్నానని ప్రకటించాడు అతడు. ఇంతకీ ఎవరా హీరో? అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. యంగ్ ట్యాలెంటెడ్ వరుణ్ ధావన్ గురించే ఇదంతా.

బాలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా వెలిగిపోతున్న వరుణ్ ధావన్ తన గాళ్ ఫ్రెండ్ నటాషా దలాళ్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ జంట పెళ్లి గోవాలో జరగనుందని.. ముంబైలో ఘనంగా రిసెప్షన్ ఉంటుందని గతంలో ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. వెన్యూ తో పాటు పెళ్లి తేదీలో మారిందని తెలుస్తోంది.

వరుణ్ – నటాషా జంట పెళ్లి 2020లో ఉంటుంది. జోధ్ పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఈ వివాహం జరగనుంది. ఉమైద్ భవన్ అనగానే ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ (నిక్యాంక జోడీ) మూడు రోజుల పెళ్లి గుర్తుకు రావాల్సిందే. ఈ జంట భారీగా బంధుమిత్రుల సమక్షంలో ఇరువురి సాంప్రదాయాల్లో పెళ్లాడుకున్నారు. అదే తరహాలో ఘనంగా ధావన్ బోయ్ తన ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడట. ఇక వరుణ్ ధావన్ కెరీర్ సంగతులు పరిశీలిస్తే ఇప్పటికే ఏబీసీడీ సిరీస్ హీరోగా యువతరంలో విపరీతమైన క్రేజు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం `స్ట్రీట్ డ్యాన్సర్` (ఏబీసీడీ సీక్వెల్) సెట్స్ పై ఉంది. ఈ చిత్రంలో వరుణ్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయిక. త్వరలోనే రిలీజ్ చేసేందుకు దర్శకుడు రెమో డి.సౌజా ప్లాన్ చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Please Read Disclaimer