సీమ మనోభావాల్ని వరుణ్ దెబ్బ తీశాడా?

0

బిగ్ బాస్ షో ప్రారంభమైన రోజున హౌస్ మేట్స్ ను పరిచయం చేసే సందర్భంలో ఒక ఆసక్తికర వ్యాఖ్య నాగార్జున నోటి నుంచి వచ్చింది. మిగిలిన హౌస్ మేట్స్ ఎవరితోనూ అనని ఒక మాటను మహేశ్ విట్టాతో నాగ్ అన్నారు. సీమ మాటలు తనకు కొన్ని నేర్పించాల్సిందిగా కోరటం మర్చిపోకూడదు. సీమ యాసలో ఇరగదీసే మహేశ్ విట్టా.. సందర్భం ఏదైనా తనదైన ఒరిజినల్ యాసలోనే తన భావోద్వేగాల్ని చూపిస్తాడు.

దాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పదాలు కొన్ని ప్రాంతాల్లో చాలా కామన్ గా మాట్లాడుతుంటారు. కానీ.. అవే పదాలు మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద తప్పుగా ఉంటాయి. రాయలసీమలో దొబ్బు అనే మాటనే చూస్తే.. నెట్టు.. లాగించు.. తిను లాంటి అర్థాలకు వాడేస్తారు. బాగా తిను అని చెప్పటానికి.. బాగా దొబ్బు అనేస్తారు. ఏదైనా బలమైన వస్తువును నెట్టాలన్నప్పుడు.. దొబ్బు.. దొబ్బు.. బాగా దొబ్బు అనేస్తారు.

ఇదే దొబ్బు అనే పదం కోస్తాలోనూ.. తెలంగాణలోనూ నెగిటివ్ అర్థం ఉంది. దొబ్బు అంటే.. దొంగలించు అన్న అర్థంలో ఉపయోగిస్తారు. సీమకు చెందిన వ్యక్తి నోటి నుంచి దొబ్బు అన్న మాట వస్తే.. ఆ విషయాన్ని అర్థం చేసుకునే కన్నా అపార్థం చేసుకుంటే దానికి మించిన పిచ్చితనం ఉండదు.

బిగ్ బాస్ షోలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉంటారు. ఎవరి యాసను వారు వాడతారు. ఒక హౌస్ లో వంద రోజులు ఉన్నప్పుడు నటిస్తూ ఉండలేరు. రకరకాల భావోద్వేగాల్లో వాళ్ల ఒరిజినల్ మాటలు వస్తాయి. అలాంటప్పుడు దాని భావం ఏమిటన్న దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం హౌస్ మేట్స్ కు ఉంది.

వరుణ్ సందేశ్ భార్య వితికను ఉద్దేశించి.. పో అంటూ మహేశ్ అన్న మాటపై ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలిసిందే. వరుణ్-మహేశ్ లు కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇదంతా ఎందుకంటే.. ఆయా ప్రాంతాల యాస మీద అవగాహన లేకపోవటమే. తాజా ఎపిసోడ్ లో మహేశ్ తన యాస కారణంగానే పో అన్నానని చెప్పారు. నిజమే.. రాయలసీమలో పో అనే మాటను చాలా కామన్ గా వాడేస్తుంటారు. అందులో కోపమో.. చిన్నబుచ్చటమో.. అవమానించాలన్న ఉద్దేశం ఉండదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే వరుణ్.. ఆయన సతీమణి వితికా ఫీల్ అయినట్లుగా ఉంటుంది.

తన యాస గురించి మహేశ్ చెప్పిన తర్వాత కూడా వరుణ్ కూల్ కాకుండా ఉండటాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. వరుణ్- మహేశ్ మధ్య గొడవ జరిగినప్పుడు విషయం చాలామందికి అర్థం కాకున్నా.. తప్పుగా మాట్లాడలేదన్న విషయం సీమ వాసులకు అర్థమైంది. అయితే.. ఏమైందోలే అన్నట్లుగా ఉండిపోయారు. వారి అంచనాలకు తగ్గట్లే తాజా ఎపిసోడ్ లో మహేశ్ క్లారిటీ ఇస్తూ.. తన యాసలో అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పినా.. వరుణ్ అదే పనిగా ఇష్యూను సాగదీయటం చూస్తే.. సీమ యాసను రెస్పెక్ట్ చేయటం రాదా? అన్న సందేహం సీమవాసుల్లో కలుగుతోంది.
Please Read Disclaimer