బిగ్ బాస్ 3 వల్ల సినిమా అఫర్లు!

0

హింది బిగ్ బాస్ లో పాల్గొన్న వారిలో చాలామందికి పాపులారిటీ వచ్చింది.. వారిలో కొందరికి కెరీర్ కూడా సెట్ అయింది. అయితే తెలుగు బిగ్ బాస్ కు వచ్చేసరికి కొందరికి పాపులారిటీ అయితే వస్తోంది కానీ ఎవరికీ ఆ ఫేమ్ ఉపయోగపడిన దాఖలాలు లేవు. సీజన్ 1 విన్నర్ గా నిలిచిన శివబాలాజికి మొదట్లో ఆఫర్లు వచ్చాయి అన్నారు కానీ ఇప్పటివరకూ ఆయన కెరీర్ ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు. సీజన్ 2 విన్నర్ కౌశల్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. శివబాలాజీ కంటే భారీ పాపులరిటీ సాధించినప్పటికీ కౌశల్ కు కెరీర్ పరంగా.. సినిమాల పరంగా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇక ఈ రెండు సీజన్ల లో పాల్గొన్న ఇతర సభ్యుల పరిస్థితి కూడా అంతే.

ఇదంతా గతం. ఇప్పుడు సీజన్ 3 విషయం తీసుకుంటే మాత్రం పార్టిసిపెంట్స్ కు వర్క్ అవుట్ అవుతున్నట్టుగా ఉంది. సీజన్ 3 టైటిల్ ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. రాహుల్.. మరో కాంటెస్టెంట్ పునర్నవి ప్రేక్షకులలో చాలామందిని ఆకర్షించారు. రాహుల్ కూడా ఒక ఇంటర్వ్యూలో తమను హీరో హీరోయిన్లు గా పెట్టి ఒక సినిమా తీయాలని ఫిలిం మేకర్లను కోరాడు. మరి ఈ రిక్వెస్ట్ కు స్పందించారో ఏమో కానీ ఒక నిర్మాత రీసెంట్ గా రాహుల్ -పునర్నవి జంటగా ఓ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇక సీజన్ 3 లో పాల్గొన్న భార్యభర్తలు వరుణ్ సందేశ్ – వితిక హీరో హీరోయిన్లనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తో ఈ జంటకు పాపులారిటీ రావడంతో వీరిద్దరితో ఒక నిర్మాత సినిమా తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడట. ఇది కాకుండా వరుణ్ సందేశ్ కు హీరోగా మళ్ళీ ఆఫర్లు వస్తున్నాయట. ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ 3 హౌస్ మేట్స్ కు లక్కు లక్కలాగా పట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఈ ఆఫర్లు అన్నీ నిజం కావాలని కోరుకుందాం.
Please Read Disclaimer